హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పోలీసుశాఖలో 17వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించినా.. రెండేండ్లుగా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని పోలీసు ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. వేలల్లో ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్ర భుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం పోలీసు ఉద్యోగాలు వస్తాయని భావించామని, నేటికీ ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కోచింగ్ సెంటర్లకు డబ్బులు ధారపోసి తమ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని చెప్తున్నారు. ఇటీవల కోచింగ్ సెంటర్లను వదిలి ఇండ్లకు వెళ్లిన నిరుద్యోగులు కొన్నిచోట ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?’ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
కేసీఆర్ హయాంలో 2022లో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయి. కోర్టు కేసుల వల్ల తుది ఫలితాలు 2023 చివర్లో వెల్లడయ్యాయి. ఎంపికయిన వారికి నియామకపత్రాలు ఇచ్చి, వాటిని తమ ఖాతాలో వేసుకు న్న సీఎం రేవంత్రెడ్డి.. అప్పట్నుంచీ ఇప్పటి వరకు పోలీసు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో హడావుడిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అపహాస్యంగానే మారిందని మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు నోటిఫికేషన్ల ఊసే ఎత్తకపోవడం దారుణమని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను సంప్రదిస్తే ‘త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయి.. శ్రద్ధగా చదువుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని, త్వరలో అంటే ఎప్పుడో చెప్పడంలేదని నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
2025 చివరిలోనైనా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురుచూసిన నిరుద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో తీవ్ర నిరాశ ఎదురైంది. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిరుద్యోగులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తున్నది. వరుస ఎన్నికలతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఎలాంటి నోఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకపోతే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.