Badibata | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పిల్లల చదువుకు కుటుంబం నుంచి లభించని ప్రోత్సాహం, బతుకుదెరువు కోసం వలసలు పోవడం కారణంగా భావిభారతం బడి బయటనే మగ్గుతున్నది. రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్’ మొత్తం 16,683 మంది ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తున్నది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను విద్యాశాఖ చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఎలిమెంటరీ (1-8వ తరగతి) స్థాయి పూర్తిచేయనివారు అత్యధికంగా 11,405, సెకండరీ స్థాయి (9, 10 తరగతులు) పూర్తిచేయని వారు 5,278మంది పిల్లలుండటం గమనార్హం. జిల్లాలవారీగా తీసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్ ఉన్నారు.
ప్రతి జిల్లాలోనూ వందల సంఖ్యలో పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. 6 -14 ఏండ్ల వయస్సువారు పాఠశాల్లో నమోదై ఉండి ఎలిమెంటరీ విద్య పూర్తిచేయకుండా మధ్యలో మానేస్తే ‘ఔట్ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్’గానే పరిగణిస్తారు. విద్యార్థి వరుసగా నెలకు పైగా డుమ్మా కొట్టినా ఇలాగే లెక్కిస్తారు. ఇటీవలీ కాలంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్’పై సర్వే చేసింది. ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలను సేకరించింది. ఆ వివరాలను కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘ప్రబంధ్ పోర్టల్’లో నమోదు చేసింది. చదువు కొనసాగేందుకు కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించకపోవటం, కుటుంబాలు వలస పోవడం తదితర కారణాలతో విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
