ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoists) పట్టుబడ్డారు. సోమవారం రాత్రి సిర్పూర్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి తారస పడిన 16 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మావోయిస్టులు వారి స్థావరాలను మారుస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోలీస్ నిఘా విభాగం సమాచారం అందిచండంతో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ పార్టీ పోలీసులు సిర్పూర్ (యూ) అడవుల్లో కూంబింగ్ నిర్వహించగా.. మావోయిస్టు స్థావరం కనిపెట్టారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించి మావోయిస్టులను పట్టుకున్నారు. మొత్తం 16 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లు తెలిసింది. ఇందులో జిల్లా కమాండెంట్ సభ్యుల స్థాయి కేడర్లో నలుగురు ఉన్నట్లు సమాచారం. పట్టుపడ్డ వారిని సోమవారం రాత్రే డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది.