Paddy Procurement | హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొనుగోలుకు అవసరమైన వస్తువుల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా ఇప్పుడు టెండర్లు పిలవడం గమనార్హం. హాకా సంస్థ సుమారు 90వేల టార్పాలిన్ల కొనుగోలుకు ఈ నెల 22న టెండర్లు పిలిచింది. ఇక ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, సన్న గింజలను కొలిచే కాలిపర్స్ పరికరాల కొనుగోలుకు ఆగ్రోస్ ఈ నెల 10న టెండర్లు పిలిచింది.
ఈ టెండరు ప్రక్రియ నవంబర్‌లో పూర్తి కానుంది. అతి ముఖ్యమైన గోనె సంచులకు సివిల్ సైప్లె సంస్థ 5న టెండర్లు పిలిచింది. 7 కోట్ల పాత గన్నీ సంచులకు టెండర్లు కోరింది. ఇప్పటి వరకు ఈ టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. వచ్చే నెలలోనే పూర్తయ్యే అవకాశాలున్నాయని పౌరసరఫరాల సంస్థ వర్గా లు తెలిపాయి. ధాన్యం కొనుగోలుకు అవసరమైన వస్తువుల కొనుగోలు ప్రక్రియ వచ్చే నెల వరకు జరిగితే.. సదరు సంస్థలు ఆ వస్తువులను సరఫరా చేసేదెప్పుడు? అవి కొనుగోలు కేంద్రాలకు చేరేదెప్పుడు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అయ్యే సరికి కొనుగోళ్లు కూడా పూర్తవుతాయని పేర్కొంటున్నారు.
గన్నీ సంచుల్లేవు
ఈ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ధాన్యం నింపేందుకు సుమారు 22 కోట్ల గన్నీ సంచులు అవసరం అవుతాయని అంచనా. అయితే ఇందులో 7 కోట్ల పాత గన్నీ సంచులు అవసరం కాగా మిగిలినవి కొత్తవి కావాలి. పాత గన్నీ సంచుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి వచ్చే నెలాఖరుకుగానీ వచ్చే పరిస్థితి లేదు. కొత్త గన్నీ బ్యాగులను కొన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరందుకోనున్న నేపథ్యంలో గన్నీ సంచుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లతో ఒప్పందం లేదు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండడం లేదు. ఓవైపు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు, మంత్రి చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో పాలసీనే విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లతో సివిల్ సైప్లె ఒప్పందం చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు ఒప్పందం జరగలేదు. యంత్ర పరికరాలు, సంచులు, టార్పాలిన్ల పరిస్థితి తెలిసిందే. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే ప్రభుత్వం కొనుగోళ్లపై హడావిడి ప్రకటనలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7248 కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు 2539 కేంద్రాలను మాత్రమే ప్రారంభించినట్టు స్వయంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టుగా చెప్పిన ప్రభుత్వం.. గడిచిన 20 రోజుల్లో కొనుగోలు చేసిన ధాన్యం 1500 టన్నులు మాత్రమే కావడం గమనార్హం.