హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల (Auto Driver) పరిస్థితి మరీ దారుణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వల్ల గిరాకీలు లేక అప్పుల ఊబిలోకి కూరుకపోతున్నారు. ప్రతినెలా ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట్టలేక తనవు చాలిస్తున్నారు. ఫలితంగా 22నెలల్లోనే రాష్ట్రంలో సుమారు 159మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఆంధ్రాలో మాత్రం అక్కడి ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఉచితబస్సు ప్రయాణం కింద మొదటి విడతగా 2.90 లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.436 కోట్లు విడుదల చేసింది. అందులోంచి ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఈ ఏడాదికిగాను రూ.15వేలు అందజేసింది. దీంతో దసరా పండుగ వేళ అక్కడి ఆటో డ్రైవర్లు సంబురాల్లో మునిగిపోగా, రాష్ట్రంలోని ఆటోడైవ్రర్లు మాత్రం ఆత్మనూన్యతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని తమ మ్యానిఫెస్టోలో ఊదరగొట్టి ఆఖరికి ఆఊసే ఎత్తడం మానేసింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటికే సుమారు 159మంది ఆటోడ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనంలేదని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు 12వేల చొప్పున ప్రభుత్వం తమకు సుమారు రూ.1,000 కోట్లు బాకీ పడిందని పేర్కొంటున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర రోడ్ సేఫ్టీ అథారిటీకి రాష్ట్ర రవాణాశాఖ తెలంగాణలో 5,14,883 ఆటోలు ఉన్నట్టు వివరించిందని చెబుతున్నారు. ఈ లెక్కన రెండేండ్లకు కలిపి సుమారు రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ద్వారా జీవన భృతి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ హామీ ఇచ్చి మర్చిపోయారని మండిపడుతున్నారు. కుటు ంబపోషణ భారంగా మారి అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి కనికరం కలుగుతుంది? అని నిలదీస్తున్నారు.