బంజారాహిల్స్, జనవరి 29: గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడినవారు.. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్లు అప్పుగా చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లో సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. పిడికెడు మందితో ప్రత్యేక రా్రష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్.. రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. అబద్ధపు మాటలు, ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. గత పదేండ్లలో పార్లమెంట్లో 2,200 ప్రశ్నలు అడిగిన ఘనత బీఆర్ఎస్ ఎంపీలకే దక్కుతుందని స్పష్టంచేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ గెలుచుకొంటుందని, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి, అర్షద్ నవాబ్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, మహాలక్ష్మీగౌడ్, వనం సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.