T-diagnostics | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 57.68 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ పరీక్షల కోసం ప్రభుత్వం 10.40 రూపాయలు కోట్లు ఖర్చు చేసిందని ఆదివారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పేదలకు వైద్య పరీక్షల ఖర్చులు భారం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ సేవలు అందిస్తున్నదని తెలిపారు. 2018 జనవరిలో హైదరాబాద్‌లో ఈ సేవలు ప్రారంభించగా, ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించామని పేర్కొన్నారు.
టీ డయాగ్నస్టిక్ ద్వారా రెండురకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, పాథలాజికల్ కింద రక్త, మూత్ర పరీక్షలు, ఇమేజింగ్ సర్వీసుల కింద ఎక్స్ రే, యూఎస్జీ, ఈసీజీ, 2డీ ఎకో, మామోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో 134 వైద్య పరీక్షలను చేర్చినట్టు పేర్కొన్నారు. డయాగ్నస్టిక్స్ సేవలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. ఈ సేవలను విజయవంతంగా నడిపించడంలో కృషి చేస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును, అధికారులు, సిబ్బంది బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.