హైదరాబాద్ సిటీ బ్యూరో, బంజారాహిల్స్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఫార్మాసిటీ, ట్రిపుల్ఆర్ బాధితులు, నిరుద్యోగులతోపాటు వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెస్ బాధితులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, అందులో సగానికిపైగా నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో వారంతా ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన అభ్యర్థులతోపాటు వివిధ వర్గాలకు చెందిన 211 మంది అభ్యర్థులు మొత్తంగా 321 నామినేషన్లను దాఖలు చేశారు.
ఆయా నామినేషన్ల పరిశీలన పూర్తయింది. బుధవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా కొనసాగింది. మొత్తం 321 నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. 186 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 135 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 130 మందికి చెందిన నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించగా, 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైనవారు ఆరోపిస్తున్నారు. సరైన కారణాలు లేకుండానే తమ నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారంటూ రాత్రంతా పలువురు అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కొన్ని కాలమ్స్‌లో వివరాలు పూరించలేదనే కారణంతో కొన్ని నామినేషన్లను తిరస్కరించగా, ఇతర టెక్నికల్ విషయాల్లో సరైన వివరాలు ఇవ్వలేదని మరికొన్ని నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్లలో లోపాలున్నా, వాటిని అమోదించిన రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని మాల సంఘాల జేఏసీ నేత చెరుకు రామచందర్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యంగం కల్పించిన తమ హక్కులను హరించారని, ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని రామచందర్ హెచ్చరించారు.
ఎన్నికల నియమావళి రైతులకు మాత్రమే వర్తిస్తుందా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు వర్తించదా? అంటూ తిరస్కరణకు గురైన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఫార్మాసిటీ భూ బాధిత రైతుల తరఫున 20 మంది నామినేషన్ దాఖలు చేయగా, ఒక్క దానిని కూడా ఎన్నికల అధికారులు ఆమోదించలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఫార్మాసిటీ బాధిత రైతులకు ఇచ్చిన హామీలను, చేసిన మోసాన్ని జూబ్లీహిల్స్ ప్రజల ముందు ఉంచుతారనే భయంతోనే తమ నామినేషన్లను తిరస్కరించారని వారు ఆరోపిస్తున్నారు. తమ నామినేషన్ల తిరస్కరణకు కారణాలేమిటని ప్రశ్నిస్తే, ఎమ్మార్వో అనితారెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని పేర్కొన్నారు.
ఆర్వో కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని కాలమ్స్ ఖాళీగా ఉండటం వల్ల రిజెక్ట్ చేశామని చెప్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ పత్రాల్లో మాత్రం కాలమ్స్ ఖాళీగా ఉంటే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులే నింపి నామినేషన్‌ను ఆమోదించారని, కాంగ్రెస్ అభ్యర్థికి ఒక న్యాయం, కాంగ్రెస్ బాధిత రైతులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఆర్వో ఎలాంటి సమాధానం చెప్పకపోగా అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు.
