హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరికొన్ని గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి ప్రజలపై పన్ను భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడితెచ్చి సదరు గ్రామాల నుంచి మున్సిపాలిటీల ఏర్పాటుకు అవసరమైన తీర్మానాలను తెప్పిస్తున్నా రు. ప్రస్తుతం సర్పంచ్లు లేకపోవడం, గ్రామాల్లో పర్సన్ ఇన్చార్జిల పాలన సాగుతుండటాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.
ఆర్థిక లోటుతో సతమతమవుతున్న సర్కారు గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చి, అక్కడి నుంచి పన్ను వసూలు చేసేందుకు ఈ కసరత్తు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 12 గ్రామాల నుంచి మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. ఆ యా గ్రామాల ప్రజలు మాత్రం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. తమ గ్రామం మున్సిపాలిటీగా మారితే.. ఆస్తి, నల్లా పన్నులు, భవన నిర్మాణాల అనుమతికి పన్ను అంటూ ఆర్థిక భారం మోపుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆ 12 గ్రామాలు ఇవే..
కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద, వరంగల్ జిల్లా ఆత్మకూరు, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర, నారాయణపేట జిల్లా మద్దూరు, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సహా మరికొన్నింటిని మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిసింది. నిబంధనలకు అనుగుణంగా కొన్ని పంచాయతీలలో జనాభా, ఇతర సదుపాయాలు లేకపోవడంతో మండల కేంద్రంతోపాటు సమీపంలోని ఇతర గ్రామాలను కలిపి మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తెప్పిస్తున్నారు. మరికొన్ని గ్రామాలను కూడా పట్టణాలుగా మార్చి మున్సిపల్ వ్యవస్థను రుద్దేందుకు పురపాలక శాఖ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్టు సమాచారం.
పన్నుల భారంతో భయం
మున్సిపాలిటీల ముసుగులో తమపై ఆర్థిక భారం మోపడాన్ని గ్రామీణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తమ గ్రామం పంచాయతీగానే ఉండాలని డిమాం డ్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ మున్సిపల్ కేంద్రంగా ఉన్న గ్రామానికే కేటాయిస్తారని, తాము వివక్షకు గురవుతామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి వారిని బుజ్జిగించడం, అవసరమైతే బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పట్టణ, స్థానిక సంస్థలకు నిధులను విడుదల నిలిచిపోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. పట్టణాల అభివృద్ధినే పట్టించుకోవడం లేదని, ఇక కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటుచేయడం వల్ల ఏమి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపాదిత మున్సిపాలిటీలు..