గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై (Ethanol Factory) స్థానిక రైతులు తిరగబడ్డారు. చంద్రబాబు శిష్యులైన ఏపీకి చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులు జబ్బల, శ్రీసా యి జబ్బల అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో బుధవారం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడికి చేరుకున్న పలు గ్రామాల రైతులు నిర్మాన పనులను అడ్డుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఏపీ టీడీపీ నేతలకు చెందిన ‘గాయత్రి రెన్యువబుల్ ఫ్యూయల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్’ క్యాంపు కార్యాలయంపై దాడిచేశారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. కంటెయినర్‌ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం పలాయనం చిత్తగించింది. పోలీసులు మాత్రం సాయంత్రం గ్రామాల మీద విరుచుకుపడి, దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేశారు.
అదుపులో తీసుకున రైతులను గద్వాల కోర్టులో హాజరు పరచడానికి బస్సులో తీసుకొచ్చిన పోలీసులు
ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. మరో ఐదు మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. సహనం కోల్పోయిన జనాలు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు తగలబెట్టడం వంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇంకా వీడియోగ్రఫీని పరిశీలిస్తున్నామని తర్వాత అందులో భాగస్వామిలైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు ఎవరు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.
పచ్చని పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ పెద్ద ధన్వాడ రైతాంగం తిరగబడింది. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఏర్పాటుచేస్తున్న ‘గాయత్రి రెన్యవ బుల్ ఫ్యూయల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్’ (జీఆర్ఎఫ్) క్యాంపు కార్యాలయంపై పలు గ్రామాల ప్రజలు దాడి చేశారు. ఫ్యాక్టరీ నిర్మించొద్దని స్థానికులు గత కొంతకాలంగా కోరుతున్నప్పటికీ, లెక్కచేయకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు చేపడుతున్నది. దీంతో ఆగ్రహించిన పెద్ద ధన్వాడ, దాని చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలు తెల్లవారుజామునే ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటికే కంపెనీ ప్రతినిధులు ప్రైవేట్ సైన్యంతోపాటు భారీ పోలీసు బందోబస్తు మధ్య పనులు ప్రారంభించేందుకు సిద్ధమమయ్యారు. రైతులు ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే ఆయా గ్రామాల శివారుల్లో రైతులెవ్వరూ బయటికి రాకుండా కాపు కాశారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల గట్ల వెంబడి ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న రైతులను చూసిన పోలీసులు వెనక్కుతగ్గారు. అక్కడే ఉన్న కంపెనీ ప్రతినిధుల కారును అడ్డగించిన రైతులు.. వ్యవసాయం చేసుకోవడానికంటూ మా భూములు కొనుక్కొని, ఇప్పుడు కంపెనీ పెడతారా? అంటూ నిలదీశారు.
కారులో ఉన్న కంపెనీ యజమానిపై, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లను రైతులు ధ్వంసం చేశారు. వాహనాలు, హిటాచీలపై కూడా రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటుచేసిన కంటైనర్‌ను పెకిలించి నిప్పు పెట్టారు. దాడికి దిగుతున్న సమయంలో పోలీసులు అడ్డుచెప్పే ప్రయత్నం చేయగా.. రైతులు వారిని పక్కకు నెట్టేసి.. ‘మా బతుకులు ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోం.. చచ్చినా ఫ్యాక్టరీ మాకొద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతాంగం ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశంలో ఆందోళన కొనసాగించింది. ఇదిలా ఉండగా జీఆర్ఎఫ్ కంపెనీ యజమాని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, స్థానిక అధికార పార్టీ నేతలు ఈ కంపెనీ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిదర్శనంగా బుధవారం కనీవిని ఎరుగని రీతిలో గద్వాల డీఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడం, దగ్గరుండి కంపెనీ పనులు ప్రారంభించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
కాగా, రైతులు దాడులు చేస్తున్నంత సేపు వీడియోలు తీసిన పోలీసులు.. ఆ తర్వాత సాయంత్రం గ్రామాలపై పడి అరెస్టులపర్వం కొనసాగించారు. గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదుతూ రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల వరకు సుమారు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడులతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. గ్రామాల్లో ఉన్న మహిళలు పిల్లలతో కలిసి పొలాల్లో దాక్కున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలన్నీ పోలీసుల చక్రబంధంలో ఉన్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా పెద్ద ధన్వాడలో ఏర్పాటుచేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారని తెలుసుకొని ఉదయం నుంచి ముందస్తుగా వారిని గృహనిర్బంధంలో ఉంచారు. గద్వాల, అయిజ, అలంపూర్ ఇతర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నేతలను బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయొద్దని, ఇప్పటికైనా రైతుల ఆగ్రహం చూసి అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లాలో ఫ్యాక్టరీ వ్యతిరేక స్వరం ఎక్కువైంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పెద్ద ధన్వాడ గ్రామంలో 27.5 ఎకరాల్లో ఏపీకి చెందిన జీఆర్ఎఫ్ కంపెనీ.. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్నది. ఫ్యాక్టరీ యజమానులు తాము వ్యవసా యం చేసుకోవడానికి పొలాలు కావాలంటూ 2017లో తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైతులను మోసం చేసి ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకొచ్చారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దంటూ నాలుగు నెలల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పి దీక్షను విరమింపజేశారు.
ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకోవడానికి రైతులు అక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్న పో లీసులు పెద్ద ఎత్తున తమ బలగాలను మోహరించారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే, రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కంపెనీ యాజమాన్యానికి సహకరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడానికి ముహూర్తం ఎంచుకోవడంతో రైతులను కట్టడి చేసేందుకు భారీ ప్రణాళిక రచించారు.