Arekapudi Gandhi | హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్‌గా మడత పెట్టేశారు. వందేండ్ల్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ‘ఖరీజ్‌ఖాతా’గా కొనసాగుతూ వస్తున్న భూమి.. ఏ మాయ చేశారో.. ఏమో.. రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది! రూ.360 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వభూమి ఎమ్మెల్యే భార్య, బిడ్డల పేరిట రికార్డులకెక్కింది.
అత్యంత విలువైన ఈ భూమిని కేసీఆర్ అధికారంలో ఉన్నంత కా లం విలువైన ప్రజాప్రయోజన ఆస్తిగా గు ర్తించి, కాపాడుకుం టూ వచ్చారు. పట్టణీకరణతో దీనిచుట్టూ వందలాది కాలనీలు వెలిశాయి కానీ, ఈ భూమి చెక్కు చెదరలేదు. ప్రస్తుతం అక్కడ చదరపు గజం రూ.80వేల నుంచి రూ.90వేల వరకు పలుకుతున్నది. ఇటువంటి భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెరబట్టారు. గోడ దూకి కాంగ్రెస్‌లో కలిసిన ఆయనకు స్వయంగా ముఖ్య నేతే పనిగట్టుకొని ఎమ్మెల్యేకు అనుగుణంగా రెవెన్యూ రికార్డులు కదిపినట్టు తెలుస్తున్నది.
కుత్భుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ పరిధిలో అరికపూడి గాంధీ భార్య శ్యామలాదేవి, కూతురు నందిత, సోదరులు అరికపూడి కోటేశ్వర్రావు, అరికపూడి రాజేంద్రప్రసాద్, స్వర్ణకుమారి పేర్ల మీద 12 ఎకరాలు పట్టా చేయించారు. అనధికారికంగా మరో 30 ఎకరాలు కబ్జా పెట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. అంతా కలిపి ఆ భూమి విలువ రూ.1000 కోట్ల మేరకు ఉంటుందని అంచనా.
గాజులరామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 307 సర్వే నంబర్లోని భూములు.. 1955 సేత్వార్ ప్రకారం.. మక్తా ఇనాం భూములు. దారుగహీబేగం సహేబా ఆ భూములకు ఇనాందారు. మొత్తం 441.32 ఎకరాలు. ఇనాం రద్దు చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 1955 జూలై 20 నుంచి ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా కొనసాగుతున్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చాక 1977లో అప్పటి ప్రభుత్వం వీటిని ఖరీజ్‌ఖాతా అంటే సీలింగ్ మిగులుగా గుర్తించింది. ఇందులో 317.06 ఎకరాల భూమిని 307/1 సర్వే నంబర్ కింద సబ్ డివిజన్ చేసింది.
ఇదే భూమిలో 238 ఎకరాలు, దానికి పక్కనే ఉన్న సర్వే నంబర్ 303లోని 33.11 ఎకరాలు మొత్తం కలిపి 272 ఎకరాలను 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ)కి 99 ఏండ్లకు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇది కాకుండా మరో 79 ఎకరాలను ప్రభుత్వం స్టోన్క్రషర్ల కోసం లీజుకు ఇచ్చింది. మరికొంత భూమిని నర్సింహారెడ్డి, మరి కొంతమంది కలిసి ఓఆర్సీ తీసుకున్నారు.
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టోన్‌క్రషర్లకు లీజుకు ఇచ్చిన భూమి మీదనే ఎమ్మెల్యే గాంధీ కన్నేశారు. ఎస్ఎఫ్సీ అధికారులు తమ స్థలానికి ఎటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం కూడా ఆయనకు కలసివచ్చింది. ఈ భూముల మీదకి ఎమ్మెల్యే ముందుగా తన అనుచరులను పంపించారు. దాదాపు 42 ఎకరాలను కబ్జా పెట్టి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పాత తేదీలతో దస్తావేజులు సంపాదించి, లీజు పొందిన క్రషర్ల యాజమాన్యం నుంచి భూమి విక్రయ పత్రాలు రాయించుకొని, వాటినే నోటరీ చేయించినట్టు తెలుస్తున్నది. వీటిని ఆధారంగా చేసుకొని 2022 డిసెంబర్ 18 నుంచి 2023 జూన్ 16 మధ్య కాలంలో తమ భార్య, బిడ్డ, సోదరుల పేర్ల మీద ఎనిమిది రిజిస్ట్రేషన్లు చేయించారు.
అరెకపూడి శ్యామలాదేవి పేరు మీద 307/ఏ సర్వే నంబర్లో 2 ఎకరాలు, నందిత గాంధీ పేరు మీద 307/ఏ/2 సర్వే నంబర్లో 2 ఎకరాలు, అరికపూడి కోటేశ్వర్రావు పేరు మీద 307/ఏ/1 సర్వే నంబర్లో 1.20 ఎకరాలు, అరికపూడి ప్రవీణ్‌కుమార్ పేరు మీద 307/ఏ/4 సర్వే నంబర్లో 2 ఎకరాలు, అరికపూడి స్వర్ణకుమారి పేరు మీద 307/ఏ/5 సర్వే నంబర్లో 12 గుంటలు, అరికపూడి రాజేంద్రప్రసాద్ పేరు మీద 307/ఏ/3 సర్వే నంబర్లో 8 గుంటలు, దండమూడి సామ్రాజ్యం పేరు మీద 307/ఏ/6 సర్వే నంబర్లో 1 ఎకరం, 307/ఏ/7 సర్వే నంబర్లో 1 ఎకరం చొప్పున, మరో ఇద్దరు ఇతర వ్యక్తుల పేరు మీద 12 ఎకరాల భూమిని కుత్భుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.
అప్పటి కుత్భుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు ఈ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ సర్వే నంబర్ అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లీజుకు ఇచ్చిన భూమి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీలింగ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయం శాఖాపరమైన తనిఖీల ద్వారా తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి, భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇష్యూ చేయకుండా రెవెన్యూ అధికారులు పక్కనపెట్టారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పటి అక్రమ రిజిస్ట్రేషన్‌ను అధికారికంగా గుర్తిస్తూ ఈ ఏడాది నవంబర్‌లో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇచ్చింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వారికి పట్టాపుస్తకాలు వచ్చాయి. ఆ వెంటనే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా(నాలా) మార్చాలని దరఖాస్తు చేసుకోవడంతో ఆగమేఘాల మీద ఆ భూమిని నాలాగా మార్పిడి చేశారు.
ఎమ్మెల్యే గాంధీ తనది అని చెప్పుకుంటున్న ఆ భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని తేలుస్తూ గతంలో కుత్బుల్లాపూర్‌లో పనిచేసిన సదానందం అనే సర్వేయర్ డిమార్కేషన్ చేసి, సరిహద్దులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మహిళా సర్వేయర్ కూడా అది ప్రభుత్వ భూమేనని తేల్చినట్టు సమాచారం. కానీ, విచిత్రంగా జిల్లా కలెక్టర్ మాత్రం లాండ్ సర్వే శాఖ నుంచి ఎలాంటి నిరూపణ పత్రాలు లేకుండానే పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చి, వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయడం గమనార్హం.
ఇప్పటికే తన కబ్జాలో ఉన్న భూమిలో కొంతభాగం అనధికారికంగా ప్లాటు చేసి విక్రయించారనే ఆరోపణలున్నాయి. అధికారికంగా పట్టా పొందిన భూమిని మాత్రం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్టు సమాచారం. ఈ భూమిలో హైరైజ్డ్ అపార్ట్మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ భూ బాగోతం మీద కుత్భుల్లాపూర్ తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ప్రస్తుతానికి తన వద్ద రికార్డులు అందుబాటులో లేవని తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఎవరి నుంచి ఎవరికి భూమి బదిలీ అయిందనే వివరాలు తన కార్యాలయంలో లేవని చెప్పారు.