హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి హెచ్వోడీలను సచివాలయంలోని పోస్టుల్లోకి తీసుకొనేందుకు గతంలో ఉన్న 12.5% కోటాను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ కోటా అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆశావహులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీనియార్టీ, ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 200కుపైగా హెచ్‌వోడీ పో స్టులున్నాయి. వీటిల్లో సూపరింటెండెంట్లను సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా, సీనియర్ అసిస్టెంట్లను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా నియమిస్తారు. గతంలో హెచ్‌వోడీల నుంచి 12.5% సిబ్బందిని తీసుకునే సంప్రదాయం ఉన్నది. అయితే ఈ కోటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలు కావడంలేదు. ఉద్యోగుల జేఏసీ ఈ కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి సర్కారు ఈ కోటాను పునరుద్ధరించింది.