హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యరంగానికి జవసత్వాలు తీసుకొస్తున్నది. అటు విద్యారంగంలోని పోస్టులను డైరెక్ట్‌గా భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ సర్కారు విద్యను బలోపేతం చేస్తున్నది. ఇప్పటికే గురుకులాల్లో 11,715 ఉద్యోగాలను భర్తీచేయగా, మరో 12,150 గురుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. పాఠశాల విద్యలోని 8,972 పోస్టులను టీఆర్టీ ద్వారా భర్తీచేయగా, మరో 6వేలకు పైగా పోస్టులను తాజాగా భర్తీచేయబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇక ఉన్నత విద్యలో 3,149 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయగా, అవి వివిధ దశల్లో ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో మరో 4,033 పోస్టులు భర్తీ కాగా, విద్యాశాఖలో సిబ్బంది కొరత గణనీయంగా తగ్గింది. నిరుపేద విద్యార్థులకు సర్కారు విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతున్నది. కాగా, ఉద్యోగాల భర్తీలో భాగంగా విద్యాశాఖలో పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీచేసినట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశనంలో నియామకాల ట్యాగ్‌లైన్ స్ఫూర్తిని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. అటు పోస్టుల భర్తీ.. ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణలతో విద్యారంగం బలోపేతమవుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో విద్యారంగానికి నిధులు వెచ్చింపు తగ్గిందన్న వాదనలను మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. పూర్తి ఆధారాలతో సహా వివరాలను మీడియా సమావేశం ముందుంచారు. 2014 -15 బడ్జెట్లో విద్యారంగానికి రూ.9,518కోట్లు మాత్రమే కేటాయించగా, 2023-24 బడ్జెట్లో రూ.29,611 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగాన్ని కీలకమైనదిగా గుర్తించి పెద్ద మొత్తంలో నిధులను కేటాయించిందని తెలిపారు. తొమ్మిదేండ్లలో విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.1, 87,269 కోట్లు ఖర్చుచేసిందని వెల్లడించారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా గురుకులాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించామని చెప్పారు. 2014-15లో గురుకుల విద్యకు రూ.973.37 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, 2023 -24 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఖర్చును రూ.4,049.01 కోట్లకు పెంచామని తెలిపారు. కేజీబీవీలు కలుపుకొంటే 1,575 కాలేజీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశామని, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, 2 న్యాయ కళాశాలలను నెలకొల్పామని చెప్పారు. ఇక పాఠశాల విద్యలో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతూ.. మన ఊరు -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలలను రూ. 7వేల కోట్లతోఅభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.