Love triangle : ట్రయాంగిల్ లవ్ ఒక యువతి హత్యకు దారితీసింది. అయితే, ఇక్కడ బాధితురాలు 19 ఏళ్ల యువతి. ఒక యువతిని ఆమె ప్రియుడు, అతడి మరో ప్రేయసి కలిసి కాల్చి చంపారు. ఈ ఘటన ముంబైలోని ఫర్కేనియా ప్రాంతం, శివాజీ నగర్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షిఫా అనే 19 ఏళ్ల యువతి, 23 ఏళ్ల ఒక యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అదే సమయంలో ఆ యువకుడు 25 ఏళ్ల మరో యువతితో కూడా ప్రేమాయణం నడుపుతున్నాడు. దీంతో ఈ అంశంపై ముగ్గురి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా వారి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షిఫా ప్రియుడు ఆమెను గన్తో కాల్చి చంపాడు. దీనికి అతడి మరో ప్రేయసి సహకరించింది. ఆమె ప్రోద్బలంతోనే అతడు షిఫాపై కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో పడి ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పులు జరిగాయి.
కాల్పుల శబ్దం నేపథ్యంలో గుర్తించిన స్థానికులు షిఫాను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. 12 గంటల్లోనే నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని, ఆ తర్వాత ఘటనపై పూర్తి వివరాలు అందిస్తామని డీసీపీ సమీర్ షేక్ తెలిపారు. ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.