Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెర్వు గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పర్లపల్లి గ్రామానికి చెందిన కాసాని మల్లయ్య – రవళి దంపతుల కుమారుడు రాజేశ్ (11) వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఊరైన బోజ్వేరు గ్రామానికి వచ్చాడు. అక్కడి ఫ్రెండ్స్‌తో సమ్మర్ హాలీ డేస్‌ను ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. అందుకే స్నేహితులతో ఆటపాటల్లో పాల్గొనడమే కాదు.. వాళ్లతో కలిసి బర్రెలను మేపేందుకు కూడా వెళ్లాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం సమయంలో బర్రెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి అక్కడే ఉన్న ఓ కూలిపోయిన బావిలో పడిపోయాడు. దీంతో స్నేహితులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు రాజేశ్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. బాలుడు బావిలో పడిపోయాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో బావిలో వెతికించారు. చివరకు రాజేశ్ మృతదేహాన్ని బయటకు తీయించారు. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు వచ్చిన బాలుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలిచివేసింది.