కామారెడ్డి, ఫిబ్రవరి 20: స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటు రావడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘ టన కామారెడ్డి జి ల్లా కేంద్రంలో గు రువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. పట్టణంలోని కల్కినగర్లో నివాసముండే పెద్దనాన్న వద్ద ఉంటూ స్కూల్కు వెళ్తున్నది.
రోజులాగే గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా జీవదాన్ స్కూల్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమీపంలోని పాఠశాల ఉపాధ్యాయులు గమనించి సీపీఆర్ చేసి, దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. శ్రీనిధి మృతితో పాఠశాలలో విషాదఛాయలు నెలకొన్నాయి.