హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభంకానుండగా, 9:35 వరకు వచ్చే విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
హాల్‌టికెట్లు విడుదల చేశామని, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షకు అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లను ఏర్పాటు చేయగా, 5, 09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్టు తెలిపారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్షరాసేవారికి మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.