మహబూబాబాద్ : మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో పలు చోట్ల రహదారులపై వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు – మహబూబాబాద్ రహదారిపై ఓ భారీ చెట్టు విరిగి పడింది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అదే దారిలో ఓ రెండు అంబులెన్స్‌లు అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. ఒక అంబులెన్స్‌లో శ్వాస సమస్యలతో బాధపడుతున్న రోగి, మరో అంబులెన్స్‌లో నిండు గర్భిణిని తరలిస్తున్నారు. చెట్టు విరిగి పడడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ క్రమంలో అంబులెన్స్ సిబ్బందే రంగంలోకి దిగారు. అంబులెన్స్ సిబ్బంది మల్లేశ్ యాదవ్, వీర్న, రాజు కలిసి గొడ్డలితో చెట్టు కొమ్మలను నరికేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను రక్షించారు. దీంతో 108 అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.