మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 8: దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆసరా పింఛన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. 2014కు ముందు మహబూబ్‌నగర్‌లో నెలకు 10,515 మందికి రూ.31 లక్షల పింఛన్లు అందిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 19,907 మందికి నెలకు రూ.4.24 కోట్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఇంకా అందని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. పింఛన్‌దారులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సాయంత్రానికి రూ.100 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న పాల్గొన్నారు.