హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు విధివిధానాల రూపకల్పనకు 10 మంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజులపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుండగా, ఈ కమిటీ సిఫారసు చేయనున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి చైర్మన్‌గా, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సభ్యకార్యదర్శిగా అధికారుల కమిటీని నియమించింది.
విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా శుక్రవారం జీవో-29ని విడుదల చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు, ఎస్సీ కులాల సంక్షేమశాఖ డైరెక్టర్ ఎన్ క్షితిజ, స్టేట్ ఆడిట్ విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, టీడీసీపీ డైరెక్టర్ ఎస్ దేవేందర్‌రెడ్డి, ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ కృష్ణయ్య, మరో ఇద్దరు సబ్జెక్టు నిపుణులు మొత్తం పది మందితో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇతర రాష్ర్టాల్లో ఫీజుల ఖరారుకు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి, ఫీజుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలు సిఫారసు చేయనున్నది.
ప్రస్తుతం ఆడిటర్లు ఆమోదించిన ఆర్థిక నివేదికల ఆధారంగా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ఫీజులను ప్రతి మూడేండ్లకోసారి సవరిస్తున్నది. ఆడిటర్లు ఆమోదించిన నివేదికలతో ఫీజులు ఖరారుచేయడానికి చెల్లుచీటి పడనున్నది. దీనిస్థానంలో ఫీజులను ఎలా ఖరారుచేయాలన్న విధివిధానాలను ఈ కమిటీ రూపొందించి సర్కారుకు సిఫారసు చేయనున్నది. 2025-28 బ్లాక్ పీరియడ్‌లో ఫీజుల సవరణను సర్కారు నిలిపివేయగా, కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఆరు వారాల్లో ఫీజులపై ఏదో ఒకటి తేల్చాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి.
ఈ నాలుగు వారాల్లో ఫీజులపై ఏదో ఒకటి తేల్చడం కష్టంగానే కనిపిస్తున్నది. తాము ప్రాథమికంగా అధ్యయనం చేస్తున్నామని, వచ్చేవారంలో కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఫీజుల ఖరారులో భాగంగా ప్రొఫెషనల్ కాలేజీలను ఐదు గ్రేడ్లుగా విభజించనున్నారు. ఏ+, ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీలన్నింటిని ఐదు గ్రేడ్లుగా విభజిస్తారు. కాలేజీలను గ్రేడ్లుగా విభజించేందుకు న్యాక్, ఎన్బీఏ, ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు, కాలేజీల్లో వసతులు, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ అంశాల ఆధారంగా కాలేజీలను గ్రేడ్లుగా విభజిస్తారు. ఈ గ్రేడ్లను బట్టే కాలేజీల ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఖరారుచేసే విషయంలోనూ గ్రేడ్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఏ+, ఏ గ్రేడ్ కాలేజీలకు ముందుగా, తర్వాతి గ్రేడ్ కాలేజీలకు ఆలస్యంగా రీయింబర్స్మెంట్ చెల్లించాలని సర్కారు ఆలోచిస్తున్నది.