Paddy Procurement | నల్లగొండ ప్రతినిధి, మే 12 (నమస్తే తెలంగాణ): ‘నల్లగొండకు కూతవేటు దూరంలోని పెద్దసూరారం కొనుగోలు కేంద్రం అది. ఏప్రిల్ 26న ఇక్కడి నుంచి టీఎస్05యూఎఫ్ 7789 నంబర్ లారీలో ధాన్యం లోడ్ అయ్యింది. లోడింగ్ సమయంలో ఆరుగురు రైతులకు చెందిన 1,057 బస్తాలను ఒక్కో బస్తా బరువును 42.5 కిలోల తూకంతో 449.22 కాంటా (బస్తా బరువు 750 గ్రాములతో కలిపి)గా లోడ్ చేసినట్టు చీటీపై స్పష్టంగా రైతులకు రాసిచ్చారు. కానీ ఇదే ధాన్యం లోడ్ లారీ శెట్టిపాలెం శివారులోని కామధేనువు రైస్ ఇండస్ట్రీకి దిగుమతికి వెళ్లే సరికి బస్తాల సంఖ్యతోపాటు తూకం కూడా తగ్గిపోయింది. అధికారికంగా జారీ చేసిన ట్రక్‌షీట్‌లో 1,038 బస్తాలుగా ఒక్కో బస్తాకు (బస్తా బరువు 700 గ్రాములు తీసేసాక) 40 కిలోల చొప్పున లెక్కకట్టి 415.20 క్వింటాలుగా నమోదు చేశారు. అంటే 19 బస్తాల ధాన్యం మాయం కావడంతోపాటు తూకంలోనూ 26.62 క్వింటాళ్లు తగ్గిపోవడం గమనార్హం. అంటే ఒక్క లారీ ధాన్యం లోడ్ అమ్ముకోవాలంటే రైతులు అక్షరాల రూ.63,595 నష్టపోతున్నారు. ఇది నల్లగొండ జిల్లాలో ధాన్యం రైతు దోపిడీకి మచ్చుకు మాత్రమే. కొంచెం అటూఇటుగా జిల్లాలో ఇదే రకమైన దోపిడీతో రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను నిలువునా దోచేస్తున్నది.’
ఎవరికి అందిన కాడికి వాళ్లు దోచుకోవడమే లక్ష్యంగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్రాలకు ధాన్యం తెచ్చింది మొదలు.. అది మిల్లుల్లో దిగుమతి అయ్యే వరకు ప్రతి దశలోనూ రైతును దోచేస్తున్నారు. రైతు తెచ్చిన ధాన్యంలో పక్కాగా పది శాతం తాలు, తరుగు తీస్తుండగా వీటికి అదనంగా లారీలు రావాలన్నా.. వచ్చాక ఎగుమతి, దిగుమతులు కావాలన్నా హమాలీలకు బస్తాకు రూ.5 నుంచి రూ.10 వరకు రైతులు సమర్పించుకోక తప్పడం లేదు. ఇవన్నీ జరిగితే కూడా ధాన్యం కొనుగోళ్ల కోసం కనీసం పక్షం రోజులకుపైగానే ఎదురుచూడక తప్పని పరిస్థితి నల్లగొండ జిల్లాలో నెలకొన్నది.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. కానీ ఏనాడు జిల్లా పరిధిలో మంత్రి ఉత్తమ్ ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించలేదు. కలెక్టర్లు, సివిల్ సైప్లె అధికారులు కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నా.. కొనుగోళ్ల వ్యవహారం రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యంగా మారింది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పట్టించుకోకపోవడంతో అధికారులు ఎంత ఒత్తిడి చేసినా మిల్లర్లు ససేమిరా అంటున్నారు. విసిగిపోయిన రైతులు రోడ్లెక్కడం మొదలుకావడంతో అధికారులు మధ్యేమార్గం ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక్క బస్తాను 40.700 కిలోలకు బదులుగా 42.500 కిలోల నుంచి 42.700 కిలోల వరకు అధికారికంగానే తూకం వేస్తున్నారు. ఇక మిల్లు వద్ద దిగుమతికి మరో ఐదు కిలోల వరకు తాలు పేరుతో అనధికారికంగా తరుగు తీసేస్తున్నారు. ఇలా ఒక్కో క్వింటాల్‌కు పది కిలోల చొప్పున ధాన్యాన్ని దోచుకుంటున్నారు.
బీఆర్ఎస్ సర్కార్ ఒక బస్తా ధాన్యం నెట్ బరువును 40 కిలోగా నిర్ధారించింది. దీనికి అదనంగా బస్తా బరువును 700 గ్రాములుగా అంచనా వేస్తూ మొత్తంగా ఒక్కో ధాన్యం బస్తాను 40.700 కిలోలుగా లెక్కించింది. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం మరో కిలోన్నర నుంచి రెండు కిలోలకు అదనంగా పెంచేసింది. ప్రస్తుత యాసంగిలో ఏకంగా దీన్ని అధికారికమే చేశారు. దీంతో ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఒక్కో బస్తా బరువు 42.500 కిలోల నుంచి 42.700 కిలోల వరకు అధికారికంగా తూకం వేస్తున్నారు. ఈ అదనపు తూకాన్ని దర్జాగా రైతులతోపాటు మిల్లర్లకు పంపే చీటీలపై రాస్తుండటం గమనార్హం.

కొనుగోలు కేంద్రంలో అదనపు తూకంతో 5 కిలోలు నష్టపోతున్న రైతులు రైస్‌మిల్లుల్లో దిగుమతి కోసం మరో ఐదు కిలోల ధాన్యాన్ని వదులుకుంటున్నారు. దీనికి ఒప్పుకోని రైతుల ధాన్యం రోజుల తరబడి లారీల్లోనే మూలుగుతున్నది. దీంతో రైతుల ధాన్యం ట్యాబ్ ఎంట్రీ కాదు.. ట్రక్‌షీట్ జారీ చేయరు. ఫలితంగా చెల్లింపులు సైతం నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రం నుంచి లారీల్లో ఎగుమతి చేశాక వెంటనే రైతుల ధాన్యం ట్యాబ్ ఎంట్రీ చేయడంతోపాటు అక్కడే మొత్తం ధాన్యం విలువతో కూడా ట్రక్‌షీట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లా అంతటా కాంటా వేసి లారీల్లో ఎత్తాక అధికారికంగా ధాన్యం విలువను లెక్కిస్తూ రైతులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే రైస్‌మిల్లర్ ధాన్యం దిగుమతి చేసుకోకుంటే ఎవ రు బాధ్యులంటూ రైతులకే అంటగడుతున్నారు.
వాస్తవంగా ధాన్యం కాంటా వేశాక ఎగుమతి నుంచి ఇతర వ్యవహారాలన్నీ నిర్వాహకులే చూసుకోవాలి. కానీ నల్లగొండ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ధాన్యం ట్రాన్స్‌పోర్టుకు అరకొరగానే కాంట్రాక్టర్లు లారీలను సైప్లె చేస్తున్నారు. జిల్లాలో 800 లారీలకు కేవలం 350 లారీలనే అందుబాటులో ఉంచారు. అగ్రిమెంట్ ప్రకారం రోజూ సగటున 35వేల టన్నుల ధాన్యం లోడింగ్ కావాల్సి ఉన్నా 16 వేల టన్నులకు అటూఇటునే జరుగుతున్నది. దీంతో కాంటా అయ్యాక కూడా పెద్ద ఎత్తున ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోతున్నది.
ధాన్యం, మక్కల కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసినా, చివరకు అధికారుల కాళ్లు పట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఓపిక నశించిన రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా కొనుగోళ్ల వ్యవహారం దారితప్పడంతో సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. నెల రోజులుగా స్పందించని సీఎం.. మంగళవారం హడావుడిగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కజొన్న, వడ్ల కొనుగోళ్లలో వైఫల్యాన్ని సీఎం పరోక్షంగా అంగీకరించారు. గన్నీ సంచుల కొరత, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, గోదాముల సమస్య ఉన్నదని ఒప్పుకొన్నారు. కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, కలెక్టర్లపైనా చర్యలకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.
గన్నీ సంచులు, గోదాముల సమస్యను కలెక్టర్లు దగ్గరుండి పరిష్కరించాలని, ప్రతి కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరగాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నెల రోజులుగా సీఎం సమీక్ష నిర్వహించలేదని, మంత్రులు సైతం అంటీముట్టనట్టుగానే వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఇప్పుడు కలెక్టర్లపై చిందులు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల తీరుపై కలెక్టర్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో నిర్ణయాల విషయంలో నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు చెప్తున్నారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత సమీక్షలు పెట్టి మిషన్ మోడ్‌లో కొనుగోళ్లు చేయాలంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ తమ శక్తిమేర చర్యలు తీసుకుంటున్నామని, సీఎం, మంత్రుల నుంచి సరైన మార్గనిర్దేశం లేకపోతే తామేం చేస్తామని అంటున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.