హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 10-12శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసు చేసింది. నిరుడు బడ్జెట్లో 7.4శాతం మాత్రమే కేటాయించారని, ఈ సారి గణనీయంగా పెంచాలని, విద్యకు కేటాయింపులు పెంచితేనే పురోగతి సాధ్యమని తేల్చిచెపింది. విద్యారంగంలో అభ్యాస పేదరికం (లర్నింగ్ పావర్టీ) ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేసింది. 2025- 26 బడ్జెట్లో విద్యారంగ బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్ చేసింది. మంగళవారం తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్రావు, చారగొండ వెంకటేశ్, జ్యోత్స్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఓ నివేదిక అందజేశారు.
ప్రభుత్వ రంగంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, యూనివర్సిటీలవారీగా కేటాయించాల్సిన బడ్జెట్‌ను తయారుచేసి సమర్పించారు. రాష్ట్రంలో సర్కారు యాజమాన్యంలో ప్రీ ప్రైమరీ విద్యనందించేందుకు కొత్తగా ఫౌండేషన్ స్కూల్స్‌ను ఏర్పాటుచేయాలని విద్యాకమిషన్ కోరింది. పాఠశాలలు, ఫౌండేషనల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు నిధులు కేటాయించాలని ఆయా నివేదికలో పేర్కొంది.