హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్‌పై వరిపైరు తిరుగుబా టు జెండా అయింది. ఎండిన పంట అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి నినదించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉద్యమ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయంపై నాడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహించినట్టే బుధవారం కూడా నిప్పులు చెరిగారు. సాగునీరు లేక ఎండుతున్న వరిపైరును చేబూని అసెంబ్లీలోకి ప్రవేశిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో గర్జించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్న నినాదాలతో స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారధ్యంలో ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రం.. నేడు కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాలు కకావికలం అవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో చెల్లాచెదురైన వ్యవసాయ రంగం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లు పంటరాసులతో తెలంగాణ అలరారి, యావత్తు దేశానికే ‘అన్నంగిన్నె’గా మారింది. ఈ 15 నెలలు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిన వైనాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో ఎత్తిచూపారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయరంగం కుదేలు అవుతున్న తీరును బీఆర్ఎస్ కండ్లకు కట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను బుధవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టే ముందు అసెంబ్లీ ప్రాంగణంలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు భేటీఅయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఆకుపచ్చని కండువాలు ధరించి, ఎండిన వరిపైరును చేతబూని నినాదాలు చే స్తూ బయటకు వచ్చారు. ఈ సమయంలో ఒక్క సారిగా అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరు వు’, రేవంత్‌రెడ్డి పాపం-రైతన్నలకు శాపం’, రైతులు ఆత్మహత్యలు చేసుకుటుంటే అందాల పోటీలా..సిగ్గుసిగ్గు’ అంటూ పెద్ద పెట్టున నినదిస్తూ బీఆర్ఎస్ మెరుపు నిరసన చేపట్టింది.
రాష్ట్రంలో సాగునీరులేక ఎండుతున్న పంటల తీవ్రతను చట్టసభల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం సఫలమైంది. బీఆర్ఎస్ ఎల్పీ కా ర్యాలయం నుంచి మీడియా పాయింట్ వరకు ఎమ్మెల్యేలు రైతుకు అండగా తాము ఉన్నామంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగా రు. వరిపైరుతో శాసనసభ లోపలికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. వరిపైరుతో రావొద్దని వారించారు. వారి చేతుల్లో ఉన్న ఎండిన వరిపైరును గుంజుకున్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్యపాలననాటి నిర్బంధం కొనసాగుతున్నదని అన్నారు.