హైదరాబాద్ జూన్ 5 (నమస్తేతెలంగాణ): ‘రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు’ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో పోలీసులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లు రైతులపై దాడులకు దిగడం దుర్మార్గమని, ఫ్యాక్టరీ పెట్టద్దన్నందుకు దాష్టీకానికి దిగడం అమానవీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గ్రామాలకు చెందిన రైతులపై దాష్టీకానికి దిగి 40 మందిపై కేసులు పెట్ట డం..12 మందిని రిమాండ్‌కు తరలించడం హేయనీయమని నిప్పులు చెరిగారు.
సీఎం సొంత జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగి 24 గంటలు దాటినా పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతులపైకి బౌన్సర్లను ఉసిగొలిపిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై, బౌన్సర్లపై కేసులెందుకు నమోదు చేయలేదని నిలదీశారు. పేద రైతుల భూములను బడా పారిశ్రామిక వేత్తలకు చౌకగా కట్టబెట్టడం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచీ అలవాటేనని, బడా బాబుల కోసం 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కడం ఆయనకు రివాజుగా మారిందని నిప్పులు చెరిగారు. రేవంత్ కనుసన్నల్లోనే పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు రైతులపై తరుచూ లాఠీలు ఝళిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో జరిగిన దాష్టీకాలే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు.
లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం తప్పుపట్టినా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మొట్టికాయలు వేసినా ఈ సర్కారుకు బుద్ధిరాలేదని హరీశ్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ భూములను వాపస్ ఇస్తామని చెప్పి నమ్మబలికిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అదే రైతులపై కేసులు పెట్టించడం ఆయన నీచమనస్తత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ‘నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను ఇష్టం వచ్చినట్టు క్కొ ట్టారు..జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడులు చేయించారు.
రుణమా ఫీ కాలేదని ప్రశ్నించిన పాపానికి సూర్యాపేట జిల్లా చిలకలూరుకు చెందిన 42 మంది రైతులపై.. వడ్ల కొనుగోళ్లలో కోతల గురించి ప్రశ్నించిన నిర్మల్ జిల్లా ఏర్వచింత రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారు’ అని విమర్శించారు. ఈ ఘటనలన్నీ రేవంత్ నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ‘ఇంకెన్ని రోజులు రైతులను అరిగోస పెడుతవ్ రేవంత్‌రెడ్డీ’ అని ధ్వజమెత్తారు. పెద్ద ధన్వాడకు చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టిండ్రు.. మరి రైతులపైకి బౌన్సర్లను ఉసిగొల్పిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై, బౌన్సర్లపై కేసులెందుకు నమోదు చేయలేదు? అయినా పేద రైతుల కడుపుకొట్టి బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచీ అలవాటే!
– హరీశ్‌రావు