PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగా ణ): మోదీ మళ్లీ తెలంగాణ బాట పట్టారు. ఎ ప్పుడూ ఉత్త చేతులు ఊపుకుంటూ రావడం, రాజకీయం చేసి పోవడం ఆయనకు అలవా టు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మోదీ.. ఈసారి ఉత్త చేతులతో వస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రజలు తెగేసి చెప్తున్నారు. ‘మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మా సమస్య లెందుకు పరిష్కరిస్తలేరు? మా రాష్ట్రంపై ఎం దుకు కక్ష?’ అని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న మోదీని కచ్చితంగా పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణపై రాజకీయ కక్ష గట్టారని విమర్శిస్తున్నరు. తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆయన ఆలోచించి ఉంటే కేంద్రంలో పదుల సంఖ్యలో రాష్ట్ర సమస్యలు పెండింగ్‌లో ఉండేవి కావని అంటున్నారు.
గిరిజన బిడ్డలకు రిజర్వేషన్లు పెంచి న్యా యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తపిస్తుంటే, కేంద్రం అడ్డుకొంటున్నది. ఎస్టీ రిజర్వేషన్ల పెం పును ఆమోదించేందుకు మోదీకి మనసు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆమోదించాలంటూ 2018, 2019లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానికి లేఖలు రాశారు. కానీ కేంద్రం నుంచి కనీస స్పందన కరువైంది.
‘నేనూ బీసీ బిడ్డనే’ అని చెప్పుకొనే మోదీ, తన సొంత వర్గానికే తీరని అన్యాయం చేస్తున్నారనే విమర్శలున్నాయి. బీసీ కుల గణన చేసేందుకు స సేమిరా అంటున్నా రు. ఎప్పుడో స్వాతం త్య్రం వచ్చిన తర్వాత దేశంలో బీసీల కులగణన చేశారు. అప్పటి నుంచి మళ్లీ చేయలేదు. బీసీ బిడ్డగా చెప్పుకొనే మోదీ.. అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని బీసీలంతా భావించారు. కానీ ఇప్పటివరకు వాళ్లకు ఆయన చేసిందేమీ లేదు.బీసీల కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణతోపాటు మరో ఏడు రాష్ర్టాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినా, కేంద్రం స్పందన లేకపోవడం గమనార్హం.
కుల గణన చేయకుండా బీసీలను, రిజర్వేషన్లు ఆమోదించకుండా ఎస్టీలను మోసం చేస్తున్న కేంద్రం, ఎస్సీలను కూడా ముంచుతున్నది. ఎస్సీ వర్గీకరణ హామీని తుంగలో తొ క్కింది. ‘మేం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తాం’ అని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్వయంగా రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి విన్నవించారు. దీనిపై మోదీ ఒక్క మాట మాట్లాడకపోవడం గమనార్హం.
ఉపాధి హామీ పథకానికి మంగళం పాడేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదనే విమర్శలున్నాయి. ఈ పథకానికి క్రమంగా బడ్జెట్ తగ్గించడంతో పాటు పని దినాలు కూడా తగ్గిస్తున్నది. గతంలో ఏడాదికి దేశవ్యాప్తంగా 13 కోట్ల పనిదినాలుంటే, దీన్ని ఈ ఏడాది 7 కోట్లకు తగ్గించింది. ఇక ఉపాధి పథకాన్ని రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొంటే దాన్ని కూడా కేంద్రం తప్పుపడుతుండటం గమనార్హం. ఉపాధిహామీలో భాగంగా రైతులు తమ పంటలను ఆరబెట్టుకొనేందుకు కల్లాలు నిర్మిస్తే వాటిని కూడా తప్పు పట్టింది. కల్లాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
మోదీ సర్కారు రై తులనూ రాజకీయం కోసం వాడుకొంటున్నది. రాష్ట్రంలో వ్యవసాయరంగం పచ్చబడి, ధాన్యం ఉత్పత్తి భారీగా పెరగడంపై కన్ను కుట్టినట్టుగా వ్యవహరిస్తున్న ది. అందుకే ధాన్యం కొనుగోలుపై ఆటంకాలు సృష్టిస్తూ కిరికిరి పెడుతున్నది. యాసంగిలో దొడ్డు ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేయబోమని తేల్చి చెప్తున్నది. సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు గడువు పొడిగించేందుకు నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్ర ప్రభుత్వమే సకాలంలో బియ్యం ఇవ్వడం లేదని నిందలు వేస్తున్నది. గత వానకాలం సీఎమ్మార్ గడువు పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది.
అకాల వర్షాలు, వరదలతో ఇటు ప్రజలు, అటు రైతులు తీవ్రంగా నష్టపోతే కేంద్రం తరఫున చిల్లి గవ్వ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా అరణ్య రోదనే అవుతున్నది. 2020లో హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు నగరం మొత్తం అతలాకుతలమైంది. రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. ఆ తర్వాత కూడా జరిగిన పంట నష్టంపైనా లేఖ రాశారు. కానీ కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిందే తడువుగా నిధులిస్తూ తెలంగాణకు మాత్రం నయా పైసా ఇవ్వడం లేదు.
కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా అవతరిస్తున్నది. ఇది కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నచ్చలేదు. ఏ వి ధంగానైనా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని కక్ష గట్టారు. అందుకే ఏ రాష్ట్రంపై లేని విధంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు పెడుతున్నారు. న్యాయపరంగా రాష్ర్టానికి రావాల్సిన నిధులు అడ్డుకొంటున్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి వేల కోట్లు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు సం క్షేమ పథకాలను ఆపేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మా ర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. నగరానికి అన్ని వైపుల ైప్లెఓవర్లు, రోడ్లు నిర్మిస్తూ ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా చేస్తున్నది. కానీ సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ ఏరియా మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంటున్నది. ఇందుకు కా రణం అక్కడ రక్షణ శాఖ భూములు ఉండటమే. రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన భూములు ఇచ్చేందు కు కేంద్రం ససేమిరా అంటున్నది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానికి కూడా విన్నవించినా ఫలితం శూన్యం.
తెలంగాణకు అన్నింటా అన్యాయం చేస్తున్న కేంద్రం, చివరికి చిన్నచిన్న వ్యాపారులకు ఇచ్చే ముద్ర రుణాల మంజూరులోనూ అన్యాయం చేస్తున్నది. దేశంలోని పెద్ద రాష్ర్టాలకు ముద్ర రుణాల పంపిణీలో అతి తక్కువగా తెలంగాణకే ఇవ్వడం గమనార్హం. కర్ణాటకకు 49.72 శాతం, మధ్యప్రదేశ్‌కు 25.03 శాతం, మహారాష్ట్రకు 21.96 శాతం, ఒడిశాకు 53.46 శాతం, పశ్చిమబెంగాల్లో 35.77 శాతం మందికి రుణాలు ఇస్తే.. తెలంగాణలో 13.88 శాతం మందికి మాత్రమే రుణాలు ఇచ్చింది. తద్వారా చిన్న వ్యాపారుల జీవితాలపై దెబ్బకొట్టింది.
ఆదిలాబాద్ సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను పునరుద్ధరించాలని రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తూనే ఉన్నది. ప్రధాని మోదీ సహా కేంద్ర భారీ పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక ఉత్తరాలు రాశారు. పునరుద్ధరిస్తామని కేంద్రం అనేక సందర్భాల్లో వాగ్దానం చేసింది. ‘మూతపడిన సీసీఐని పునరుద్ధరిస్తాం’ అని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహీర్ (జూన్ 5, 2017న) ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపింది. కేంద్ర మంత్రి అనంత్ గీతేను కలిసి సీసీఐ పునరుద్ధరణపై (ఏప్రిల్ 4, 2018న) చర్చించారు. హామీని నిలబెట్టుకోవాలని మంత్రి కేటీఆర్ కూడా అనేక ఉత్తరాలు రాశారు. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు ఆగస్టు 7, 2021న ఒకసారి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జనవరి 1, 2022న మరోసారి లేఖలు రాశారు. అయినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. దీనిపై తాజా పర్యటనలో ప్రధాని మోదీ ఏం చెప్తారా? అని ఆదిలాబాద్ ఆశగా ఎదురుచూస్తున్నది.