వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ మొండివైఖరితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ సొంతూరైన ముత్తోజిపేటలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన సాధారణ కార్యకర్తలా వ్యవహరించారని ఆర్టీసీ కార్మికులు, మృతుడి బంధువులే ఆరోపిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్‌ను బట్టబయలు చేసిందని రాజకీయ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ముత్తోజిపేటకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించి, అరెస్టు చేసిన పోలీసులు.. అదే బీజేపీ నాయకులకు యథేచ్ఛగా అనుమతించడం కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మైత్రీబంధాన్ని రుజువు చేస్తున్నది. హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందిన శంకర్‌గౌడ్ మృతదేహాన్ని శుక్రవారం ముత్తోజిపేటకు తరలించారు. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలించే ముందే ఏం చేయాలనే దానిపై సర్కార్ పెద్దల నుంచి స్పష్టమైన వర్క్‌షీట్ అందిందని, దానికి అనుగుణంగానే పరిణామాలు చోటుచేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలోని మృతుడి కుమార్తె ఇంటికి (నర్సంపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం) తరలించారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నిర్బంధం
శంకర్‌గౌడ్ మృతదేహం ముత్తోజిపేటకు చేరకముందే నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చి మృతదేహానికి శాంతియుతంగా నివాళులర్పించారు. కార్మికులు కోరుతున్నట్టు మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపోకు తరలించే అవకాశం కల్పించాలని, ఇందులో రాజకీయాలకు ఎలాంటి తావు ఇవ్వకుండా చూడాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తనతోపాటు, తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ డిపో పరిసరాలకు వెళ్లబోమని హామీ ఇచ్చారు. అందుకు పోలీసులు ససేమిరా అన్నారు.
కుటుంబసభ్యులు, ఆర్టీసీ కార్మికుల కోరికనూ మన్నించరా? అని నిలదీయడంతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు పెద్ది సుదర్శన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని చెన్నారావుపేట, నెక్కొండ మీదుగా నర్సింహులపేట, దంతాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో తిప్పారు. నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి స్వయంగా తన వాహనంలో ఎక్కించుకొని ఆయా స్టేషన్లకు తిప్పారు. ఆయనతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి సహా పలువురు వచ్చి నివాళులర్పించి కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్న సమయంలో వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. హనుమకొండ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ నర్సంపేటకు బయలుదేరేలోపే పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.
హైదరాబాద్ హైవేపైనే అడ్డగింత
హైదరాబాద్ నుంచి నర్సంపేటకు బయలుదేరిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవితను రఘునాథ్‌పల్లి మండలం కోమళ్ల టోల్గేట్ వద్ద, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ను చిల్పూరు మండలం చిన్నపెండ్యాల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. భువనగిరిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సహా పలువురిని అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.
బీజేపీ నేతలకు యథేచ్ఛగా అనుమతి
ముత్తోజిపేట వెళ్లేందుకు బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షులతోపాటు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు సహా పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు యథేచ్ఛగా అనుమతించారు. ఎక్కడా ఎటువంటి ఆంక్షల్లేకుండా, ఎక్కడికి వెళుతున్నారనే కనీస విచారణ చేయకుండా వదిలారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముత్తోజిపేటకు చేరుకునేలోపే వందలాది మంది బీజేపీ శ్రేణులు చేరిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు బీజేపీ నేతలను విడిచిపెట్టడం విమర్శలకు తావిస్తున్నది. ‘నేను తిట్టినట్టు చేస్తా.. నువు ఏడ్చినట్టు చేయి’ అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడబలుక్కొని ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని పక్కదారి పట్టించాలనే యోచనలో భాగంగానే నర్సంపేటలో ఉద్రికత్తలు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బండి సంజయ్ వైఖరితో ఆగమాగం
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన బాధ్యతను విస్మరించి ప్రవర్తించడంతో ఇటు ఆర్టీసీ కార్మికులు, మృతుడి కుటుంబసభ్యులు విసిగిపోయారు. బండి సంజయ్ వచ్చింది పరామర్శ కోసం కాదని, కేవలం రాజకీయం కోసమేననే విమర్శలు వినిపించాయి. మృతుడి కుటుంబానికి న్యాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, మృతదేహాన్ని కార్మికులు, కుటుంబసభ్యులు కోరినట్టు డిపో వద్దకు చేర్చేందుకు పోలీసులకు కేంద్రమంత్రి హోదాలో నచ్చజెప్పి తీసుకెళ్లడమో, లేదా హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడటమో చేయాల్సింది పోయి సాధారణ కార్యకర్తలా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. బాధితుల పక్షాన నిలిచే క్రమంలో హుందాగా ప్రవర్తించాల్సిందిపోయి కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ముందుగా బండి సంజయ్ మృతదేహానికి నివాళులర్పించి బయటకు వెళ్లే క్రమంలో మృతదేహాన్ని పెట్టిన ఫ్రీజర్‌ను డిపోకు ఎందుకు తీసుకెళ్లనివ్వరంటూ లాగారు. అంతే ఒక్కసారిగా కార్యకర్తలు రెచ్చిపోయారు. మృతదేహం అనే కనీస కనికరం చూపకుండా రోడ్డుపైన ఒక వస్తువును లాక్కొని ఈడ్చి అవతల పారేసినట్టు, బంతిని ఒకరి చేయి నుంచి మరొకరికి విసిరేసినట్టు అత్యంత అమానవీయంగా నడిరోడ్డుపై లాక్కెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆర్టీసీ కార్మికులు, పట్టణవాసులు ఏం జరుగుతుందోననే ఆందోళనకు గురయ్యారు. ముందు శవాన్ని ఎత్తుకెళ్తున్న వారిలో బీజేపీ శ్రేణులు, వెనుక పోలీసులు.. ఇలా దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుమీదున్న బారికేడ్లను తొలగించుకుంటూ, పోలీసులను తోసుకుంటూ ఇష్టారీతిన లాక్కెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు చుట్టుముట్టి అడ్డుకున్నారు.
‘మా నాన్న శవాన్ని మాకివ్వండి’
మృతదేహాన్ని లాక్కెళ్లిన అనంతరం ఎర్రటి ఎండలో దాదాపు గంటన్నరపాటు బండి సంజయ్‌తో వరంగల్ సీపీ దశలవారీగా మంతనాలు జరిపారు. పరిస్థితి ఎటుదారి తీస్తుందోననే ఆందోళన చెందిన మృతుడి కుటుంబసభ్యులు ‘దయచేసి మా నాన్న శవాన్ని ఇవ్వండి.. దానం చేసుకుంటాం’ అని అడిగేదాకా బండి సంజయ్, ఆయన బలం చూసుకున్న కార్యకర్తలు రెచ్చిపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. కుటుంబసభ్యుల స్పందనతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు. మొత్తానికి బండి ఎపిసోడ్ మొత్తం ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని, ఆ స్క్రిప్ట్‌కు కాంగ్రెస్ సర్కార్ పూర్తి సహాయ సహకారాలు అందించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

వలిగొండ పోలీస్‌స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలుపుతున్న శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనచారి