2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండేది. 2000-2013 మధ్య సగటు సాగునీటి విస్తీర్ణం సుమారు 20%25% మాత్రమే ఉండేది. మొత్తం సాగుభూమిలో 75% పైగా వర్షాలపై ఆధారపడి ఉండేది. 2013 నాటికి నికర సాగుభూమి సుమారు 45 లక్షల హెక్టార్లు కాగా, అందులో కాల్వల ద్వారా సాగునీరు పొందిన భూమి 10 లక్షల హెక్టార్ల కంటే తక్కువగా ఉండేది. చెరువులు, బోర్లు ప్రధాన వనరులుగా ఉండేవి. భూగర్భజలాల వినియోగం 60% కంటే ఎక్కువగా ఉండటం వల్ల అనేక ప్రాంతాల్లో నీటి మట్టం పడిపోయింది.
రైతుల ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండేది. 200-42013 మధ్య తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి సగటున 1200-1500 వరకు నమోదయ్యాయి. అప్పుల భారం అధికంగా ఉండేది. చిన్న రైతులలో 70% పైగా రైతులు అప్పులపాలై ఉండేవారు. 2011 జనగణన ప్రకారం గ్రామీణ పేదరికం సుమారు 30% వరకు ఉన్నట్టు అంచనా. పంటల దిగుబడుల విషయానికి వస్తే, వరి దిగుబడి 2013 నాటికి హెక్టారుకు సుమారు 2500-3000 కేజీల మధ్య ఉండేది. పత్తి దిగుబడి హెక్టారుకు 400-500 కేజీల మధ్య ఉండేది. మక్క దిగుబడి సుమారు 3500 కేజీల వరకు ఉండేది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు ప్రారంభమయ్యాయి. 2014లో మొత్తం సాగునీటి విస్తీర్ణం సుమారు 25 లక్షల ఎకరాలు ఉండగా, 2022 నాటికి ఇది 75 లక్షల ఎకరాలకు పైగా పెరిగింది. అంటే సుమారు 200% కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సుమారు 45 లక్షల ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం ఏర్పడింది.
బీఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయ ద్వారా 2015-2021 మధ్య సుమారు 46,000 చెరువుల పునరుద్ధరణ జరిగింది. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం సుమారు 20%30% పెరిగింది. భూగర్భ జలాల స్థాయి అనేక ప్రాంతాల్లో 25 మీటర్ల వరకు మెరుగుపడింది. రైతుబంధు పథ కం 2018లో ప్రారంభమై ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.10,000 పెట్టుబడి సాయం అం దింది. 2023 నాటికి ఈ పథకం ద్వారా మొత్తం రూ.73,000 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది. రైతుబీమా ద్వారా 2018-2023 మధ్య సుమారు 1 లక్షకు పైగా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెల్లింపులు జరిగాయి.
పంటల విస్తీర్ణం, దిగుబడుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. వరి ఉత్పత్తి 2013లో సుమారు 68 లక్షల టన్నులుగా ఉండగా, 2022 నాటికి 250 లక్షల టన్నులకు పైగా పెరిగింది. వరి దిగుబడి హెక్టారుకు 3000 కేజీల నుంచి 4000-4500 కేజీల వరకు పెరిగింది. పత్తి ఉత్పత్తి 2013లో సుమారు 40 లక్షల బేళ్లుగా ఉండగా, 2022లో 70 లక్షల బేళ్లకు చేరుకుంది. మక్క ఉత్పత్తి కూడా 2 రెట్లు పెరిగింది. వ్యవసాయ వృద్ధిరేటు 2014కు ముందు 1%2% మధ్య ఉండగా, 2018-2022 మధ్య కొన్ని సంవత్సరాల్లో 15%20% వరకు నమోదైంది. 2020-21లో ఇది సుమారు 20%కి చేరింది.
రైతుల ఆదాయం 2013లో సంవత్సరానికి రూ.60,000రూ.80,000 మధ్య ఉండగా, 2022 నాటికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెరిగింది. గ్రామీణ పేదరికం 30% నుంచి 15%18% వరకు తగ్గినట్టు అంచనా. ఇన్ని మార్పుల ఫలితంగా నెర్రెలు బాసిన నేల పచ్చని పొలాలుగా మారింది. వ్యవసాయం లాభదాయక రంగంగా రూపాంతరం చెందింది. తెలంగాణ వ్యవసాయం సంక్షోభం నుంచి సుసంపన్నత దిశగా ప్రయాణించింది. ఈ మార్పును కేవలం అభివృద్ధిగా చూడలేం, ఇది ఒక సామాజిక ఆర్థిక పునర్జన్మ.
బీఆర్ఎస్ పాలన, విధానాలు, మార్కెట్ అనుసంధానం, సాంకేతికత వినియోగంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రధాన ఆర్థిక ఆధారంగా గుర్తించి బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచింది. 2014-15లో వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ సుమారు రూ.10,000 కోట్లు ఉండగా, 2022-23 నాటికి ఇది రూ.25,000 కోట్లకు పైగా పెరిగింది. అంటే దాదాపు 150% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల ప్రత్యక్షంగా రైతుల సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మార్కెట్ సదుపాయాల విస్తరణలో ప్రతిఫలించింది. వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. 2014కు ముందు రోజుకు సగటున 68 గంటల విద్యుత్తు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది కూడా స్థిరంగా లేకపోవడం వల్ల రైతులు బోర్లు వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయడంతో నీటి వినియోగంలో స్థిరత్వం వచ్చింది. ఫలితంగా బోర్లు, మోటార్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయ ఉత్పత్తి పెరగడంలో కీలక పాత్ర పోషించింది.
మార్కెట్ వ్యవస్థలో సంస్కరణలు కూడా రైతులకు మేలు చేశాయి. 2014కు ముందు పంటలకు సరైన ధరలు పొందడంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దళారుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కానీ 2017 తర్వాత డిజిటల్ ఫ్లాట్‌ఫాంల అనుసంధానం వల్ల రైతులు తమ పంటలను విస్తృత మార్కెట్‌కు విక్రయించే అవకాశాలు పొందారు. రాష్ట్రంలో 50కి పైగా మార్కెట్ యార్డులు డిజిటల్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. ఈ పురోగతి వల్ల ధరల 30%40% వరకు పారదర్శకత మెరుగుపడినట్టు అంచనా.
తెలంగాణ వ్యవసాయ రంగంలో జరిగిన మార్పు ఎంత గొప్పదో గణాంకాలే స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2013 కాలానికి ముందు పరిస్థితులను తీసుకుంటే, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 90 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉండేది. ఇందులో వరి ఉత్పత్తి సుమారు 68 లక్షల టన్నులు, మక్క సుమారు 15 లక్షల టన్నులు, పప్పుధాన్యాలు కలిపి 7 లక్షల టన్నుల వరకు ఉండేవి.
పత్తి ఉత్పత్తి సుమారు 40 లక్షల గింజల బేళ్ల వరకు పరిమితమయ్యేది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువ కూడా తక్కువ స్థాయిలో ఉండేది. రైతుల ఆదాయం స్థిరంగా లేకపోవడం వల్ల వ్యవసాయం లాభదాయక రంగంగా భావించేవారు కాదు. తాజా అంచనాల ప్రకారం తెలంగాణలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 300 లక్షల టన్నులకు పైగా చేరుకున్నది. వరి ఉత్పత్తి ఒక్కటే 260 లక్షల టన్నుల వరకు పెరిగింది. అంటే 2013తో పోలిస్తే దాదాపు 4 రెట్లు పెరుగుదల నమోదైంది. వరి దిగుబడి హెక్టారుకు 2500-3000 కేజీల స్థాయి నుంచి 4500-5000 కేజీల స్థాయికి చేరుకున్నది. మక్క ఉత్పత్తి 15 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నులకు పైగా పెరిగింది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా 7 లక్షల టన్నుల నుంచి 12 లక్షల టన్నులకు చేరుకున్నది. పత్తి ఉత్పత్తి విషయంలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2013లో 40 లక్షల బేళ్లుగా ఉన్న ఉత్పత్తి, 2026 నాటికి 75 లక్షల బేళ్లకు పైగా చేరుకున్నది. చెరువులు, కాల్వలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, భూగర్భ జలాల మెరుగుదల అన్నీ కలిసి ఈ విస్తరణకు దోహదపడ్డాయి.
రైతుల ఆదాయం విషయంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. 2013లో ఒక రైతు సగటు వార్షిక ఆదాయం రూ.60,000రూ.80,000 మధ్య ఉండగా, 2026 నాటికి ఇది రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పెరిగినట్టు అంచనా. అంటే దాదాపు 3 రెట్లు పెరుగుదల. వ్యవసాయ రంగంలో స్థిరత్వం రావడం వల్ల గ్రామీణ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. వ్యవసాయ వృద్ధిరేటు కూడా గతంతో పోలిస్తే అధికంగా కొనసాగుతున్నది. 2014కు ముందు 1%2% మధ్య ఉన్న వృద్ధి, 2020 తర్వాత కొన్ని సంవత్సరాల్లో 15%18% స్థాయిలో కొనసాగుతున్నది. ఇది దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.
గతంలో కరువు, నీటి కొరత, తక్కువ దిగుబడులు, అప్పుల భారం వంటి సమస్యలతో బాధపడిన తెలంగాణ రైతులు, నేడు అధిక ఉత్పత్తి, స్థిర ఆదాయం, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతుంది. ఒకప్పుడు నెర్రలు బాసిన నేలగా పేరుగాంచిన ఈ భూమి, ఇప్పుడు నిజంగా బంగారం పండించే నేలగా మారింది. అందువల్ల నెర్రలు బాసిన నేలలో నేడు బంగారం పండుతుంది అనే వాక్యం కేవలం భావోద్వేగానికి పరిమితం కాదు. అది గణాంకాలతో, దిగుబడులతో, అభివృద్ధి సూచికలతో నిరూపితమైన వాస్తవం. గతం నుంచి వర్తమానం వరకు వచ్చిన ఈ మార్పు తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఒక విప్లవాత్మక మలుపుగా నిలిచింది.

– డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి