Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. దక్షిణ పరగణాస్ జిల్లాలోని సోనాపూర్ను అభిషేక్ సందర్శించిన సమయంలో కొందరు ఆయనపై దాడి చేశారు. కోడిగుడ్లు, రాళ్లతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకులు హంతకులయ్యారని, బీజేపీకి ఇది సిగ్గు చేటు అని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.
దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ దాడిలో గాయపడ్డ అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయనను మమతా బెనర్జీ శనివారం సాయంత్రం పరామర్శించారు. ఈ దాడిపై టీంఎసీ కూడా తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో భారీ విజయం సాధించిన తర్వాత కూడా బీజేపీ దాడులకు పాల్పడటం సిగ్గు చేటని పార్టీ విమర్శించింది. మరో టీఎంసీ నేత సుష్మితా దేవ్ స్పందించారు. ఇది ముందుగా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇది ప్రజల ఆగ్రహం కాదని, టీఎంసీని అంతం చేసేందుకే ఈ దాడి చేసిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు.
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
రాజకీయ విబేధాలున్నంత మాత్రాన ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించడం సరికాదన్నారు. బెంగాల్లోని ప్రతిపక్ష నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కీలక నేత అయిన అభిషేక్ బెనర్జీకి ఉద్దేశపూర్వకంగానే పోలీసులు సరైన భద్రత కల్పించలేదన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ దాడిని ఖండించారు. దీన్ని హత్యాయత్నంగా ఆయన అభివర్ణించారు. బెంగాల్లో అనాగరిక పాలన నడుస్తోందన్నారు. బీజేపీ హింసాత్మక రాజకీయాల్ని నమ్ముకుందని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండిస్తున్నారు.