సూర్యాపేట, మే 7 (నమస్తే తెలంగాణ) : అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కసాయిలా మారిన కాంగ్రెస్ పోయి మళ్లీ కరుణ గల కేసీఆర్ రావాలనేది నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షగా మారిందని చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నరేండ్లలో టూరిస్టు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొలి నుంచీ ప్రజలను మొక్కుకుంటూ వా రికి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇస్తే, అం దరినీ తొక్కుకుంటూ సీఎం అయిన రేవంత్ మాత్రం ప్రజలకు ఏమీ ఇవ్వకపోగా, బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని కూడా అమలు చేయడంలేదని దుయ్యబట్టారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏవగించుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీని తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
దక్షిణాది రాష్ర్టాల్లో ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నారని, కేరళ, తమిళనాడులో ఏం జరిగిందో చూశామని, తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ కావడం ఖాయమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను అరిగోస పెట్టిందని, యూరియా మొదలు విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, నీళ్లు ఏదీ అందకుండా ద్రోహం చేసిందని మండిపడ్డారు. తీరా కష్టపడి రైతులు పంటలు పండిస్తే కొనుగోలు చేయడం చేతకావడం లేదని దుయ్యబట్టారు. 2022లో కరోనా వచ్చినా, నాడు కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, ప్రత్యేకంగా రైలు వేసి బీహార్ నుంచి హమాలీలను రప్పించి 93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఈ సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం పండించినట్టు చెప్తున్న ప్రభుత్వం.. ఇప్పటికి 17 లక్షల టన్నుల ధాన్యం మా త్రమే కొనుగోలు చేసిందని విమర్శించారు. కేసీఆర్ ఇంటింటికీ నల్లా నీళ్లు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ఆదుకుంటే, కాంగ్రెస్ మాత్రం ఎవరిపై కేసులు పెట్టాలి? కమీషన్లు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నదని దుయ్యబట్టారు.
కోదాడలో కర్ల రాజేశ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నదని, రాజేశ్ చావుకు కారకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాలి మోటర్లలో తిరుగుతూ గాలి మాటలు, ఉత్తర ప్రగల్భా లు పలుకడం తప్ప ఎవరికీ కనిపించడం లేదని దుయ్యబట్టారు. నాడు కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేయడంతో కోదాడ నియోజక వర్గంలోని మోతె, నడిగూడెం, మునగా ల మండలాల్లో కాళేశ్వరం జలాలు పారాయని వివరించారు. ఏండ్ల తరబడి మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్క మంచి పని చేసినట్టు చెప్పగలడా? అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, విద్యాసంగర్, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.