కరీంనగర్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్లో బీజేపీ రౌడీమూకలు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి చేసేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి రాళ్లు, కర్రలతో దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. అక్కడినుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తీసుకెళ్లగా అక్కడ కూడా దాడికి తెగబడ్డారు. దాడిపై ప్రశ్నించినందుకు కరీంనగర్ విద్యారణ్యపురిలోని బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త గోడిశాల పావనీగౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. అంతటితో ఆగకుండా జ్యోతినగర్‌లోని బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపైనా బీజేపీ నేతలు విచక్షణారహితంగా కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇలా నాలుగు చోట్ల బీజేపీ గూండాలు అరాచకం సృష్టించడంతో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితమైన నగరంలో గతంలో లేని ఓ విష సంస్కృతికి బీజం వేశారు. గన్మెన్లు అప్రమత్తమై గదికి తాళం వేయడంతో ప్రమా దం తప్పినా.. అక్కడితో ఆగని కాషాయమూకలు మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎ మ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు. అద్దాలు, పూలకుండీలు, కుర్చీ లు, కిటికీలు, ఫర్నిచర్‌తో పాటు అక్కడే ఉన్న కౌశిక్‌రెడ్డి ఫార్చునర్ కారును ధ్వంసం చేశారు. గురువారం పోలీసుల సాక్షిగా బీజేపీ చేసిన గూండాగిరీపై సర్వత్రా విమర్శలకు దారితీసిం ది.
దేశంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన కేం ద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజ య్ ఇలాకాలో ఈ ఘటన జరుగడం, అది కూడా ఆయన అనుచరులే దాడికి తెగబడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిహార్ గూండా బ్యాచ్ మాదిరిగా అడ్డూఅదు పు లేకుండా వ్యవహరించిన బీజేపీ గూండాగిరీని అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలం కాగా, దాడులను నిరసిస్తూ ఈ నెల 9న కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గురువారం కరీంనగర్ ఎ మ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. కరీంనగర్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమవుతున్నదని చెబుతూనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కూడా పలు ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారని, అయితే తాము ఏ టెస్టుకైనా సిద్ధమని, ఆయన సిద్ధమే నా? అని సవాల్ విసిరారు. ఇరిగేషన్, ఐటీ, సి విల్ సప్లయ్.. ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా దమ్ము, ధైర్యం ఉంటే గీతాభవన్ చౌరస్తా వద్ద చర్చకు రావాలని, సబ్జెక్ట్ మాట్లాడకుండా విమర్శలు చేయొద్దని స్పష్టంచేశారు.
సరిగ్గా ఉదయం 11గంటలకు ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత అదే క్యాంపు ఆఫీస్‌లోకి కౌశిక్‌రెడ్డి వెళ్లగా, ఆయన వెంట కొందరు మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. వారితో అరగంట మాట్లాడి తిరిగి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీజేపీ గూండాలు, కార్పొరేటర్లు ఆఫీస్‌లోకి చొచ్చుకొని వచ్చారు. దాదాపు 40మంది పెద్ద పెద్ద కర్రలు, రాళ్లు చేత పట్టుకొని గదిలో ఉన్న కౌశిక్‌రెడ్డిపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యే గన్‌మెన్ గది లో ఉన్న సిబ్బందిని, ఎమ్మెల్యేను అలర్ట్ చేసి.. గది తలుపు మూసివేశారు. అయినా డోర్ బద్దలుకొట్టేందుకు రౌడీమూకలు యత్నించారు.
విషయం తెలుసుకున్న పొలీసులు కొంతమంది చేరుకున్నారు. పోలీసుల ముందే కొందరు బీజేపీ గూండాలు కర్రలు, రాళ్లతో డోర్‌ను తీసే ప్రయత్నం చేయగా, గన్మెన్లు అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయి ఆఫీస్ పరిసరాల్లో కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. అంతేగాక కర్రలతో కౌశిక్‌రెడ్డి ఫార్చునర్ కారును, కారు అద్దాలను తునాతునకలు చేశారు.

బీజేపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పక్కా ప్లాన్‌తోనే దాడి జరిగినట్టు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితం బండి సంజయ్ చెప్పిన మాటలు ఈ దాడికి ప్రేరణగా నిలిచాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3న కరీంనగర్‌లోని ఓ నగల దుకాణంలో చోరీ, దుండగల దుశ్చర్య ఘటన జరిగింది. 4న కేటీఆర్ కరీంనగర్‌కు వచ్చి గాయపడిన బాధితులను పరామర్శించిన తర్వాత గంగుల కమలాకర్ ఎమ్మెలే క్యాంపు ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఏ విషయంలోనూ బండి సంజయ్‌ని ఒక్క మాట అనరని, ఐదుగురు అగంతకులు తుపాకులతో బెదిరించి నగలు దోచుకెళ్లినా రాష్ట్ర ప్ర భుత్వాన్ని సంజయ్ ఒక్కమాట అనకపోవడం లో ఆంతర్యమేమిటని, ఎవెక్యూ ప్రాపర్టీ విషయంలో ముఖ్యమంత్రికి, బండి సంజయ్‌కు ఉన్న సంబంధాలు ఎక్కడ చెడిపోతాయోనన్న భయంతో మాట్లాడటం లేదేమోనని, కేంద్ర స హాయమంత్రి హోదాలో ఎవరికి సహాయం చే స్తున్నారో త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో గంటలోపే సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి.. ఎవెక్యూ ప్రా పర్టీ విషయంలో రేవంత్‌రెడ్డికి తనకున్న సం బంధాలను నిరూపించాలని డిమాండ్ చేస్తూనే అసహనంతో ఊగిపోయారు.
కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆధారాలు చూపకపోతే కే టీఆర్ను కరీంనగర్లో తమ కార్యకర్తలు అడుగు పెట్టనివ్వరంటూ హెచ్చరికలు చేశారు. సరిగ్గా బండి సంజయ్ చెప్పిన 48గంటల్లోనే గురువారం దాడి జరుగడం చర్చనీయాంశమైంది. ఉదయం 11గంటలకు కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ను లైవ్ చూసిన కొందరు బీజేపీ అగ్రనేత లు అప్పటికప్పుడు దాడికి ఉసిగొల్పినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కౌ న్సిల్ సమావేశం ముగిసిన వెంటనే పలువురు బీజేపీ కార్పొరేటర్లు జ్యోతినగర్‌లో ఓ దుకా ణం వద్దకు చేరుకున్నారని సమాచారం. అప్పటికే అక్కడికి దాదాపు 40మంది వరకు పోగై, దాడి చేసే లక్ష్యంతో కర్రలు, రాళ్లు అన్నీ సమకూర్చుకున్నారని తెలిసింది. కొంత దూరం వా హనాల్లో వచ్చి.. ఆ తర్వాత ఒక్కసారిగా దూ సుకొచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై గూండాగిరీ ఘటన పోలీసులకు తెలిసే జరిగిందా? అనే అనుమానాలున్నాయి. అక్కడ జరిగిన పలు పరిణామా లు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దాడిచేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నమే చేశారు తప్ప.. వారిని చెదరగొట్టకపోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. రౌడీ మూకలపై లాఠీచార్జీ చేసి ఉంటే.. ఇంత నష్టం జరిగేది కాదనే అభిప్రాయాలున్నా యి. నగరం నడిబొడ్డున ముప్పై నలభై మంది బీజేపీ నాయకులు, రౌడీలు ఒకే చోట చేరి, క్యాంపు కార్యాలయం వరకు చేరుకున్నారంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బీజేపీ గూండాల, నాయకుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు నిరసనగా ఈ నెల 9న కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. బీజేపీ నాయకుల విధ్వంసాలు, కుట్రలు, విష సంస్కృతిని ప్రజలకు తెలియజేయడంతో పాటు భద్రతా వైఫల్యాలను వివరించడంలో భాగంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్టుగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొత్తగా దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీజేపీ విష సంస్కృతిని ప్రజలు గుర్తించి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
క్యాంపు ఆఫీస్‌పై దాడి ఘటనను నిరసిస్తూ కరీంనగర్ జ్యోతినగర్‌లోని బండి సంజయ్ క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నేతలు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. అప్పటికే ఎంపీ క్యాంప్ ఆఫీస్ పరిధిలో పోలీసులు మోహరించారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు సైతం అక్కడి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్‌గౌడ్, పొన్నం రాజేశ్, దూలం సంపత్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి ఎంపీ క్యాంపు ఆఫీస్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసుల ముందే బీజేపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సంపత్‌గౌడ్ తలకు గాయం కావడంతో వైద్యం కోసం దవాఖానకు తరలించారు.

1) గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో రౌడీమూక దాడికి పాల్పడుతున్న దృశ్యాలివి.. ఎమ్మెల్యే కౌశిక్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న ఓ బీజేపీ కార్పొరేటర్. క్యాంప్ ఆఫీసు ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తున్న మరో యువకుడు

2) కరీంనగర్ జ్యోతినగర్‌లోని బండి సంజయ్ క్యాంపు ఆఫీస్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల ముందే కర్రలతో దాడిచేస్తున్న బీజేపీ కార్యకర్తలు

3) బండి సంజయ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడిచేస్తున్న బీజేపీ గూండాలు

4)కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి కౌశిక్‌రెడ్డిని బందోబస్తు మధ్య హుజూరాబాద్ తరలిస్తున్న పోలీసులు