హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారితో కలిసి ఆయన గురువారం మాట్లాడారు. మాటలు చెప్పడం, మోసం చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి అలవాటేనని ధ్వజమెత్తారు. వరంగల్ రైతు సంగ్రామ సభకు వేలాదిగా తరలి వచ్చిన రైతులను చూసి అధికారపార్టీలో కలవరం మొదలైందని దెప్పిపొడిచారు. కేటీఆర్ స్పీచ్ విన్న తర్వాత ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని ఎద్దేవాచేశారు. అందుకే హస్తిన నుంచే డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. రేవంత్ మెప్పు కోసమే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అడ్డగోలుగా మాట్లాడారని ఆరోపించారు. సర్కార్ నిర్వహించిన రైతుమేళాకు కనీసం 2వేల మంది కూడా రాలేదని గుర్తుచేశారు.
అధికార, ధన మదంతోనే పీసీసీ చీఫ్ కేసీఆర్ కుటుంబంపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పదవులు, కాంట్రాక్ట్‌ల్లో పంపకాల కోసం ఢిల్లీ నుంచి సీఎం పంపించిన స్క్రిప్ట్ చదివారని ఎద్దేవాచేశారు. కేటీఆర్ పుట్టుక గురించి ప్రశ్నించడం దుర్మార్గమని ఖండించారు. ‘గతంలో రాహుల్ పుట్టుక గురించి మాట్లాడిన బీజేపీ నేతను కేసీఆర్ తప్పుబట్టి ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి చీకటి చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసని చురక లంటించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా చిల్లర వ్యవహారాలు మానుకోవాలని హితవు పలికారు. ఆరు గ్యారెంటీల పేరిట గారడీ చేసిన కాంగ్రెస్ కచ్చితంగా మోసపూరిత పార్టీయేనని ప్రశాంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అందుకే కేటీఆర్ 420 పార్టీ అన్నారని స్పష్టంచేశారు. డిక్లరేషన్ల ముసుగులో మాయమాటలు చెప్పిన రాహుల్‌గాంధీని బరాబర్ ప్రశ్నిస్తామని తేల్చిచెప్పారు. పదేళ్లు ఐటీ మంత్రిగా తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేటీఆర్ గురించి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలువని వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ కమిషన్లు వేసి ఏం సాధించిందని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేండ్లలో అవినీతి జరిగిందని రుజువుచేయగలిగారా? అని నిలదీశారు. ఇప్పటికైనా రైతులకు బోనస్, రైతుభరోసా, మహిళలకు ప్రతినెలా 2500, తదితర హామీలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చీకట్లో చే తులు కలిపి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు గంగుల క్యాంపు కార్యాలయం, కౌశిక్‌రెడ్డి కారుపై దాడి చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మోర్తాడ్, మే 7: మాజీ మంత్రి కేటీఆర్ స్థాయి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చరిత్ర తెలుసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వేముల గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ అంతర్జాతీయ స్థాయి నాయకుడని, ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లేదని చెప్పారు. కేటీఆర్ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ముఖచిత్రాన్ని మా ర్చిన నాయకుడని, ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలను కల్పించి హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా నిలబెట్టారని కొనియాడారు. కేటీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, ఒక్కసారి గెలువని మహేశ్‌కుమార్‌గౌడ్ కేటీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.
హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్లను ఎట్టకేలకు ప్రభుత్వం రద్దు చేసింది. సుదీర్ఘకాలంగా ప్రధాన కార్యాలయంలోనే తిష్టవేసిన 16మంది సిబ్బందిని సొంత పోస్టులకు తిప్పిపంపింది. ఈ మేరకు గురుకు ల సొసైటీ కార్యదర్శి శారద గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీశారు. ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని, వెం టనే రిలీవ్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యుటేషన్ల రద్దుపై గురుకుల సొసైటీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మంత్రి అడ్లూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ పాలన గాడి తప్పిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొంతకాలంగా మొత్తుకుంటున్నాయి. డిప్యుటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ కథనాలను సైతం ప్రచురించింది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్లను రద్దు చేస్తామని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సైతం ప్రకటించా రు. అయినప్పటికీ ఓడీలను రద్దు చేయకుండా సొసైటీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేశారు. దీంతో విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యుటేషన్ రద్దమయిన వారిలో పీఎస్ఆర్ శర్మ, కిశోర్, రజిని, రుత్మనీ, వరలక్ష్మి, సుదర్శన్, నవీన్‌కుమార్, సరిత, వైష్ణవి, స్వాతి, అనుజ, శ్రీ నివాస్, ఆఫ్షా జబీన్, హరిణి, సింధూర, ఖుర్షీద్పాషా ఉన్నారు.