బంజారాహిల్స్, మే 7: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ తలపెట్టిన అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు భవిష్యత్తు కాలంలో కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉందని సేవ్ కేబీఆర్ కార్యక్రమం ప్రతినిధి విజయ్ ముల్లంగి అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద పీవీఆర్ విగ్రహం, బయోడైవర్సిటీ చిహ్నం వద్ద హెచ్ సిటీ పేరుతో భారీగా చెట్లను నరికివేసిన ప్రాంతంలో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేపట్టారు. వేలాది చెట్లను నరికివేసి భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తారు.. అంటూ ప్రశ్నించారు.
ఒకవైపు పచ్చదనం కాపాడుతామంటూ హోర్డింగ్స్ పెట్టే ప్రభుత్వాలు కమీషన్ల కోసం భారీ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించి పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ సేవ్ కేబీఆర్ ప్రతినిధి విజయ్ ముల్లంగి మాట్లాడుతూ.. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్‌గ్రౌండ్ మొత్తాన్ని కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నంతో పార్కులోని జీవరాశుల మనుగడకే ప్రమాదమన్నారు. అరుదైన పక్షులు, జంతువులు ఉన్న కేబీఆర్ పార్కులోని చెరువుల్లోకి వర్షపునీరు రాకుండా పోతుందని, ఎకో సెన్సిటివ్ జోన్ లేకుంటే నేషనల్ పార్కులోని జీవులకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే హెచ్సిటీ ప్రాజెక్టును నిలిపివేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు.
కేబీఆర్ పార్కు చుట్టూ నరికివేసిన చెట్లను ట్రాన్స్‌లోకేషన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని, ఆయితే ట్రాన్స్‌లోకేషన్ చేసిన వాటిలో కేవలం 5 శాతం మాత్రమే బతుకుతాయని అనేక సర్వేల్లో తేలిందన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, జేఎన్టీయూ లాంటి ప్రాంతాల్లో మెట్రో విస్తరణ చేస్తే వేలాది వాహనాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ పనిచేయకుండా కేబీఆర్ పార్కు మీదుగా 8 అండర్‌పాస్ జంక్షన్లకు ప్లాన్ చేయడం వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని నాశనం చేయవద్దు
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ భారీ వృక్షాలను నరికివేస్తూ పర్యావరణానికి తీరని ద్రోహం చేస్తున్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ పర్యావరణ ప్రేమికుల ఆందోళనను తీవ్రతరం అవుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, కేబీఆర్ పార్కు వాకర్లు, సందర్శకులు ‘సేవ్ కేబీఆర్’ పేరుతో ప్రదర్శనలు చేస్తున్నారు. గురువారం కేబీఆర్ పార్క్ వద్ద ‘పరిసర్ సంవాద్’ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్కు నుంచి అనేక పక్షులు, నెమళ్లు బయటకు వచ్చి రోడ్డుపక్కనున్న చెట్ల నీడన సేదతీరుతుంటాయని, అలాంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టు వివరాలు బయటపెట్టడం లేదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉండగా, కోవిడ్ సమయంలో అభిప్రాయ సేకరణ చేశామని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆరోపించారు. ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లను నరకడం ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువతీయువకులు, వాకర్లు పాల్గొన్నారు.