భగీరథ్ కనిపిస్తే 1098కి కాల్చేయండి ఈ ఫొటోలోని వ్యక్తి పోక్సో కేసు నిందితుడు. బండి భగీరథ్ అతడి వయస్సు 26 ఏండ్లు. మారు వేషంలో ఎవరికైనా ఎక్కడైనా కనిపించినా దయచేసి చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కి కాల్ చేయండి. వాస్తవానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కాదు.. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పెట్టాలి.
– ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరుకావాలని పోలీసులు అతడి తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. పోక్సో కేసు నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను రక్షించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసు నమోదై ఆరు రోజులైనా హోం మంత్రిగా ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇటీవల మోదీ సభలో నిందితుడి తండ్రి సంజయ్‌పై పొగడ్తలు కురిపించిన సీఎం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారనుకోవడం భ్రమేనని దెప్పిపొడిచారు. చిన్నప్పటి నుంచే దారితప్పిన, నేర చరిత్ర కలిగిన భగీరథ్‌తో మహిళాలోకానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత బొమ్మెర రామ్మూర్తి, ఫయాజ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే భగీరథపై నమోదైన పోక్సో కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. కానీ కొందరు అజ్ఞానులు కేటీఆర్, పార్టీ నేతలపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. బాలికకు అండగా ఉన్న తెలంగాణ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బాధిత బాలిక వ్యక్తిత్వ హననానికి కుట్రలు చేస్తున్నదని ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. అడ్డదిడ్డమైన పోస్టులు, ఫొటోలతో బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఎందుకు స్పందించడంలేదు? వారికి కుటుంబాలు, బిడ్డలు లేరా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం మౌనం వహించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అనేది వదిలి ఆమె మైనరా? మేజరా? అనే చర్చను తెరపైకి తేవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. డీజీపీతో మా ట్లాడి బాధితురాలి ఫొటోలు, పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితుడిని పట్టుకోవడం, ఆయన తండ్రి ని కట్టడి చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. పరారీలో ఉన్న పోక్సో కేసు నిందితుడు భగీరథ్ ఫోర్జరీ సంతకంతో పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిళ్ల వల్లే పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. భగీరథ్ ఫొటోలను చూపుతూ ఆచూకీ తెలిస్తే వెంటనే 1098కు గానీ, డయల్ 100కు గానీ తెలియజేయాలని, లేదంటే తమకు వాట్సాప్ చేయాలని కోరారు.
తెలంగాణ అమ్మగా తనకు తాను భావిస్తున్న కవిత బాధిత బాలిక ఆర్తనాదాలు వినకుండా, అండగా నిలిచిన బీఆర్ఎస్ను బద్నాం చేయడం దురదృష్టకరమని ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆమె నిజంగా తెలంగాణ అమ్మే అనుకుంటే బాధిత కుటుంబం పక్షాన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోం మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాలని హితవు పలికారు. కానీ బండి, రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, భరోసానిచ్చిన బీఆర్ఎస్ను నిందించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఆమె తెలంగాణ అమ్మ కాదు.. రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే మరమనిషి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆరోపణలు వచ్చిన కొడుకును చట్టానికి అప్పగించి నిబద్ధత చాటుకోవాల్సిన బండి సంజయ్.. మొన్న కరీంనగర్లో ఏక్తాయాత్రలో తన కొడుకుపై ఆరోపణలు చేస్తున్న వారిని అంతుచూస్తానని బెదిరించడం శోచనీయమని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఆయన ఎవరి అంతు చూస్తారు..బాధితురాలినా? లేదంటే బీఆర్ఎస్నా? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ని పోక్సో కేసులో ఏ2గా చేర్చాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నిందితుడు సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై నిర్వహించిన భారీ ర్యాలీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
పోక్సో కేసులో విచారణకు రావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడు మేనమామకు నోటీసులు ఇచ్చారు. ఐదు రోజుల నుంచి నిందితుడు పరారీలో ఉంటే.. కరీంనగర్లో అందరి కండ్ల ముం దే ఏక్తాయాత్రలో ఉన్న అంతుచూస్తానన్న అతడి తండ్రి, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్మార్కి ఇవ్వకుండా మేనమామకు నోటీసులు ఎలా ఇస్తారా? పోక్సో కేసులో నిందితుడికి గానీ అతడి మేనమామకు గానీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలని ఏ చట్టంలో రాసి ఉందో డీజీపీ సమాధానం చెప్పాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్