హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్టపాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్, బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో మరోసారి డైవర్షన్ అస్ర్తాన్ని రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రయోగించింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి, వారి దృష్టిని మరల్చేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న, ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్మాలా ఈ-రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావించని రాష్ట్రంలోని ప్రధాన మీడియా మాత్రం.. కేటీఆర్‌కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా ఉన్నదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తంచేస్తున్నది.
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండికి అడుగడుగునా సహకారం అందిస్తున్న రేవంత్ సర్కార్.. ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేయకుండా నీరుగార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే, బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు యత్నించినా , బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో బయటపెట్టక తప్పలేదు. పోక్సో కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశగా సర్కార్ వ్యవహారం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గీయులే తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతోపాటు, పోక్సో కేసును తొక్కిపెట్టేలా చేశారు. ఆ తరువాత బండి కుమారుడిపైనే ‘హనీట్రాప్’ జరిగిందనే ప్రచారానికి తెరలేపారు. పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉన్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అభాసుపాలైంది. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుండటం, బీఆర్ఎస్తోపాటు పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్‌కు ఏ స్థాయిలో సహకరిస్తున్నదో స్పష్టమవుతున్నది. తాజాగా బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున పేలవమైన వాదనలు వినిపించడానికే అనుభవం లేని న్యాయవాదిని నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోక్సో కేసు విషయంలో అన్నివిధాలా సర్కార్ అభాసుపాలవుతున్నది. కాంగ్రెస్, బీజేపీ స్నేహబంధం బట్టబయలవుతున్నది. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. అనూహ్యంగా కేటీఆర్‌కు ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయడం అందులో భాగమేనని రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.
గత 30 నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీస్తూనే ఉన్నా రు. 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. బోనస్, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయా విషయాల మీది నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తీసుకువస్తూనే ఉన్నది. కాళేశ్వరం కమిషన్ల పేరిట కొద్దికాలం, ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒకసారి, ఫార్ములా ఈ-రేస్ అంటూ మరోసారి డ్రామాలు ఆడుతూ వచ్చింది. ఇటీవల కాం గ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రతరమైంది. మంత్రివర్గం వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ శ్రే ణుల భూముల దందాలు, బ్లాక్‌మెయిలింగ్ అం శాలన్నీ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. వీటిపై ప్ర జల్లో విపరీతమైన చర్చ కొనసాగుతున్నది. తాజాగా పోక్సో కేసులోనూ సర్కార్ తీవ్రంగా అభాసుపాలవుతున్నది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ప్రజల దృష్టిని దారిమళ్లించేందుకు మరోసారి నోటీసుల డ్రామాకు రేవంత్ సర్కార్ తెరతీసిందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది.