ధర్మశాల : ఐపీఎల్-19లో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ పోతూపోతూ గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) అద్భుత ఆటకు తోడు బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ (4/39) సత్తా చాటడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన తర్వాత వరుసగా ఐదో ఓటమితో పంజాబ్ మరింత డీలా పడింది. తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (32 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సర్లతో 57) అర ్ధశతకంతో రాణించగా, ఆఖర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (17బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. తర్వాత ముంబై 19.5 ఓవర్లలో 205/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) కూడా సత్తా చాటాడు. తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ముంబైకి అద్భుత ఆరంభం అందించాడు. తొలుత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (25) ఇబ్బంది పడినా.. ర్యాన్ మాత్రం భారీ షాట్లతో అలరించాడు. రెండో ఓవర్లో సిక్సర్ల ఖాతా తెరిచిన అతను యాన్సెన్ బౌలింగ్‌లో 4,6,4.. బార్ట్లెట్ ఓవర్లో 6,4తో జోరు చూపెట్టాడు. బార్ట్లెట్ వేసిన ఆరో ఓవర్లో తను మరో సిక్స్ కొట్టగా.. తొలి 13 బంతుల్లో 6 రన్స్ మాత్రమే చేసిన రోహిత్ కూడా సిక్స్ బాదడంతో పవర్ ప్లేను ముంబై 59/0తో ముగించింది. అయితే, ఫీల్డింగ్ మారిన తర్వాత పంజాబ్ బౌలర్లు పుంజుకున్నారు. ఏడో ఓవర్లో ఆర్య పట్టిన క్యాచ్‌తో రికెల్టన్ను ఔట్ చేసిన ఒమర్జాయ్ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. వచ్చీ రాగానే ఓ సిక్స్ రాబట్టిన నమన్ ధీర్ (9) యాన్సెన్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌కు చిక్కాడు. పదో ఓవర్లో సిన్నర్ చహల్ లో లెంగ్త్ బాల్‌తో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో ముంబై 88/3తో డీలా పడింది. ఈ టైమ్‌లో తిలక్ వర్మ జట్టు బాధ్యత తీసుకున్నాడు. వరుస బౌండరీలతో తిలక్ లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో రూథర్‌ఫర్డ్ (20)ఇబ్బంది పడటంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. 30 బంతుల్లో 70 రన్స్ అవసరమైన దశలో చహల్ వేసిన 16వ ఓవర్లో తిలక్ 6,4.. రూథర్‌ఫర్డ్ భారీ సిక్స్ బాది 20 పరుగులు రాబట్టి జట్టుపై ఒత్తిడి తగ్గించారు. కానీ, రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసిన ఒమర్జాయ్ పంజాబ్‌ను రేసులోకి తెచ్చాడు. అయినా తిలక్ వెనక్కుతగ్గలేదు. యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. అదే ఓవర్లో ఓ ఫోర్ రాబట్టిన విల్ జాక్స్ (25 నాటౌట్).. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 6, 4 బాదాడు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 15 రన్స్ అవసరం అయ్యాయి. తొలి బాల్‌కు జాక్స్ సిక్స్ కొట్టగా.. తిలక్ వరుసగా రెండు సిక్సర్లతో ముంబైని గెలిపించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (27), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 33 బంతులోన్లే 50 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే లభించిన జీవనదానాన్ని అందిపుచ్చుకున్న ప్రభ్‌సిమ్రన్ వరుస బౌండరీలతో ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఆరో ఓవర్లో దీపక్ చహర్ నకుల్ బాల్‌తో ప్రియాంశ్‌ను బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీశాడు.పవర్ ప్లేను 55/1తో ముగించిన తర్వాత కనోలి (21)తోడుగా ప్రభ్ జోరు కొనసాగించాడు. రఘు శర్మ వేసిన పదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన అతను కార్బిన్ బాష్ బౌలింగ్‌లో మరో సిక్స్ రాబట్టి ఈ సీజన్లో ముంబైపై రెండోసారి ఫిఫ్టీ అందుకున్నాడు. అయితే, 12వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్ పదునైన బంతులతో పంజాబ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. మూడు బంతుల వ్యవధిలో ప్రభ్‌సిమ్రన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (4)ను ఔట్ చేసి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పాడు. ఆ వెంటనే కనోలిని రాజ్ బవా బౌల్డ్ చేయగా.. సూర్యాంశ్ షెడ్గే (8), శశాంక్ సింగ్ (2) నిరాశ పరిచారు. దాంతో 15 ఓవర్లకు 135/6తో పంజాబ్ కష్టాల్లో పడింది. తర్వాతి ఓవర్లో బుమ్రా ఐదు రన్సే ఇవ్వగా.. ఆల్‌రౌండర్ యాన్సెన్ (2)ను బౌల్డ్ చేసిన శార్దూల్ ఆ జట్టును మరో దెబ్బకొట్టడంతో స్కోరు 180 దాటితే గొప్పే అనిపించింది. కానీ, ఒమర్జాయ్ అనూహ్యంగా రెచ్చిపోవడంతో ఆఖరి మూడు ఓవర్లలో ముంబై బౌలర్ల వ్యూహాలు ఫలించలేదు. శార్దూల్ ఆఖరి బంతిని స్టాండ్స్‌కు చేర్చిన అతను.. చహర్ వేసిన 18వ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టి ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన విష్ణు వినోద్ (15 నాటౌట్), జేవియర్ బార్ట్లెట్ (18 నాటౌట్) ఫీల్డర్ల తప్పిదాన్ని సొమ్ము చేసుకొని చివరి రెండు ఓవర్లలో 34 రన్స్ రాబట్టడంతో పంజాబ్ ఈ సీజన్లో ఎనిమిదోసారి 200 పరుగుల మార్కును దాటగలిగింది.

పంజాబ్: 20 ఓవర్లలో 200/8 (ప్రభ్‌సిమ్రన్ 57, ఒమర్జాయ్ 38, శార్దూల్ 4/39);
ముంబై: 19.5 ఓవర్లలో 205/4 (తిలక్ 75 నాటౌట్, రికెల్టన్ 48, ఒమర్జాయ్ 2/36)