జహీరాబాద్, ఆగస్టు 2: హైదరాబాద్-ముంబయి వయా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్నడిపించాలని జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రయత్నాలు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే, సమాచార ప్రసార మంత్రులను కలిసి మొదటి డీపీఆర్ ప్రకారం బహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. మొదటి డీఆర్పీ ప్రకారం హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్‌ను వయా జహీరాబాద్ మీదుగా నడవాల్సి ఉండగా, రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకుల ఒత్తిడితో రెండో డీఆర్పీ ప్రకారం జహీరాబాద్ బదులుగా, వికారాబాద్ మీదుగా నడిపించేందుకు ప్రతిపాదలు సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో జహీరాబాద్ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్త్తాయి. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం కలిసికట్టుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్‌ను వయా జహీరాబాద్ మీదుగా నడిపించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, నాయకుడు గొల్లభాస్కర్ తదితరులతో పాటు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఢిల్లీ బాట పట్టారు.
సంబంధిత రైల్వేమంత్రి ఆశ్వీని వైష్ణవ్, రైల్వే అధికారులను కలిసి ప్రతిపాదనలు, వినతి పత్రాలు అందజేయడంతో సానుకూలంగా స్పందించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో బుల్లెట్ ట్రైన్ కోసం భూముల సేకరణను అక్కడి రైతులు అడ్డుకుని పెద్ద ఎత్తున్న ఆందోళన నిర్వహించారు. దీంతో బుల్లెట్ ట్రైన్‌ను వయా జహీరాబాద్ మీదుగా నడిపించాలనే జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు అందజేసిన ప్రతిపాదనలు, వినతులను సమగ్ర పరిశీలన కోసం రైల్వే మంత్రి సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు బుల్లెట్ ట్రైన్ వయా జహీరాబాద్ మీదుగా నడిపించే విషయంలో పరిశీలన పూర్తయిన వెంటనే తదుపరి అవసరమైన చర్యలు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. దీంతో బుల్లెట్ ట్రైన్ కోసం జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించే దిశలో అడుగులు పడుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జహీరాబాద్‌లో అనేక పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. తాజాగా స్మార్సిటీతో పాటు నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పా టు పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ మీదుగా నడిపితే దేశంలోని ప్రధాన నగరాలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది. దీంతో జహీరాబాద్ ప్రాంతంలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున్న నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయి. మొదటి విడత డీఆర్పీ ప్రకారం బుల్లెట్ ట్రైన్ వయా జహీరాబాద్ మీదుగా నడిపించే వరకు కేంద్ర రైల్వేమంత్రిత్వ శాఖ, అధికారులపై ప్రజాప్రతినిధులు, నాయకులు మరింత ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జహీరాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.