సిటీబ్యూరో, ఆగస్ట్ 2 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢబోనాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భాగ్యనగరంలో బోనాల పండుగకు చారిత్రక నేపథ్యముందని, నగర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట ఉత్సవాలు ముగిశాయని, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయన్నారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలి సారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నా మన్నారు.