న్యూఢిల్లీ : భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు షాక్ తగిలింది. డబుల్ వరల్డ్ చాంపియన్ అయిన నిఖత్ ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం అవుతోంది. మెగా ఈవెంట్ల కోసం పటియాలాలో నిర్వహిస్తున్న నేషనల్ ట్రయల్స్‌లో నిఖత్ అనూహ్యంగా ఓడిపోయింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, గత ఆసియా క్రీడల కాంస్య విజేత అయిన నిఖత్ మహిళల 51 కేజీ విభాగం సెమీఫైనల్లో 1-4 తేడాతో సాక్షి చౌదరి చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న ఆమె ప్రయత్నాలకు బ్రేక్ పడింది. డబుల్ వరల్డ్ చాంపియన్ హోదాలో ఉన్న నిఖత్ ఇలా ట్రయల్స్‌లోనే వెనుదిరగడం భారత బాక్సింగ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ట్రయల్స్ విషయంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) మధ్య ఏర్పడిన గందరగోళంతో బాక్సర్లు నరకం చవిచూశారని నిఖత్ ఆవేదన వ్యక్తం చేసింది. బీఎఫ్ఐ అనుసరిస్తున్న ‘అసెస్మెంట్’ పద్ధతిపై పలువురు బాక్సర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో సాయ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల మధ్యలోనే అసెస్మెంట్ క్యాంప్ నిలిచిపోవడంతో పాటు, చివరి నిమిషంలో మళ్ళీ పాత పద్ధతిలో ట్రయల్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ అనిశ్చితి వల్ల తమ శిక్షణ, బరువు నియంత్రణ వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నిఖత్ చెప్పింది. ‘గత రెండు వారాలు బాక్సర్లు నరకం అనుభవించారు. నేను ఎవ్వరినీ తప్పుబట్టడం లేదు. కానీ, బీఎఫ్ఐ, సాయ్ నడుమ బాక్సర్లు నలిగిపోయారు. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కావాల్సిన క్యాంప్ వాయిదా పడుతూ వచ్చింది. అసెస్మెంట్ పాయింట్లు తగ్గుతాయనే భయంతో చిన్నచిన్న గాయాలున్నా లెక్కచేయకుండా ప్రాక్టీస్ చేశాం. కానీ, చివరి నిమిషంలో మేం చేసిన ఫిజికల్ టెస్టులు, బీప్ టెస్టుల పాయింట్లను పరిగణనలోకి తీసుకోమని చెప్పడం తీవ్ర నిరాశకు గురిచేసింది’ అని నిఖత్ పేర్కొంది. ప్రస్తుతం శారీరక, మానసిక అలసటగా ఉన్నందున కొంతకాలం ఆటకు విరామం తీసుకుంటానని నిఖత్ చెప్పింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్పై దృష్టి సారించి మెరుగైన ప్రదర్శన చేస్తానని ధీమా వ్యక్తం చేసింది.