వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. కోతలు కోసి 45 రోజులు దాటినా.. ధాన్యం కొంటలేరని కడుపుమండి మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా వద్ద రహదారిపై ముండ్ల కంపవేసి.. వడ్లకు నిప్పుపెట్టి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు. వారం క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, వడ్లను కొనడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లను కొనాలంటే అలాట్మెంట్ రాలేదని, లారీలు లేవని ఐకేపీ నిర్వాహకులు సాకులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం అలాట్మెంట్ వచ్చినా రైస్ మిల్ యజమానులు అష్టమి ఉన్నదని వడ్లు వద్దన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే రోడ్డుపై టెంట్లు వేసుకుని కూర్చుంటామని హెచ్చరించారు.
– గంభీరావుపేట
ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులైనా ధాన్యం కొనడం లేదన్న ఆగ్రహంతో సూర్యాపేట జిల్లా గుర్రంతండా వద్ద దంతాలపల్లి-సూర్యాపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. నినాదాలు చేస్తూ తమ వడ్లు కొనేదాకా రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
– చివ్వెంల
నెల రోజులవుతున్నా వడ్లు కాంటా వేయడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్లో మంగళవారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నెల రోజులైనా కొనడం లేదని మండిపడ్డారు. చీకటి పడినా ఆందోళనను కొనసాగించడంతో ఎస్సై నరేశ్ వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడించారు. బుధవారం నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
-రామారెడ్డి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ముష్టిపల్లిలో సోమవారం రాత్రి 6:30 గంటలకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మంగళవారం ఉదయమే కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ధాన్యం తీసుకురాగా ఐకేపీ అధికారులు కేంద్రాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు ఇబ్బందిపడ్డారు.
-మక్తల్