బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందగా.. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు. మంగళవారం ఆయా సొసైటీలకు యారియా లోడ్ రాగా రైతులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుంచే బారులు తీరారు. కొన్ని చోట్ల సోమవారం నుంచే యూరియా కోసం పడిగాపులు కాయగా.. మరికొన్ని చోట్ల బుధవారం పంపిణీ చేయనున్న యూరియా కోసం ఒక రోజు ముందుగానే చెప్పులు, ఆధార్‌కార్డులు, పట్టాపాస్ బుక్కులు క్యూలో పెట్టారు. ఆయా చోట్ల పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసు పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిచారు.
వారం రోజులుగా నిరీక్షణ
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు
ఏం జరిగింది : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో వారం రోజులుగా యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. మంగళవారం 10 గంటలకు అధికారులు వచ్చి పోలీస్ పహారాలో కొందరికి యూరియా పంపిణీ చేశారు. చాలా మందికి అందలేదు.
2 వేల మంది.. 400 బస్తాలు
వరంగల్ జిల్లా పర్వతగిరి
ఏం జరిగింది: వరంగల్ జిల్లా కల్లెడ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరినా సరిపడా దొరక్కపోవడంతో అవస్థలు పడ్డారు. 400 బస్తాలు అందుబాటులో ఉండగా 2 వేల మంది వరకు రైతులు లైన్లో నిలబడగా దొరకనివారు వెనుదిరిగారు.
క్యూలో పాస్ బుక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని సింగిల్‌విండో గోదాం వద్ద 500 మంది రైతులు బారులు తీరారు. 250 యూరియా బ్యాగులే ఉండడం, రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు.
రెండోరోజూ బారులే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
ఏం జరిగింది : కొత్తగూడెం జిల్లా పాల్వంచ సొసైటీ వద్ద రెండో రోజూ రైతులు యూరియా కోసం బారులుతీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రైతులు నిరీక్షిస్తే 120 మందికి యూరియా పంపిణీ చేసి, మిగతా వారిని పంపించేశారు.
వర్షంలోనూ తప్పని తిప్పలు
వనపర్తి జిల్లా ఆత్మకూరు
ఏం జరిగింది : వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీసీఎస్కు సోమవారం 400 బస్తాల యూరియా లోడ్ వచ్చింది. ఇక్కడ 200 బస్తాలు అన్లోడ్ చేసి మిగితావి అమరచింత కేంద్రానికి పంపారు. అక్కడ 50 బస్తాలు మాత్రమే పంపిణీ చేసి అయిపోయిందని చెప్పడంతో ఆత్మకూరు-మరికల్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
ఎక్కువ రేటుకు విక్రయం
రాజన్న సిరిసిల్ల జిల్లా కంచర్ల
ఏం జరిగింది : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల ఐకేపీ గోదాంకు 225 బస్తాలు రాగా, రైతులు వర్షంలో గొడుగులు పట్టుకొని గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. ఒక్కో పాస్బుక్కుకు బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ. 225 దొరికే బ్యాగును రూ.290కి విక్రయించడంపై మండిపడ్డారు.
రోడ్డెకిన బీఆర్ఎస్ నేతలు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు
ఏం జరిగింది: యూరియా కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్వద్ద వద్ద సిద్దిపేట- కరీంనగర్ రాజీవ్ రహదారిపై మంగళవారం చేపట్టిన మహా ధర్నాలో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీస్ బలగాలు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
గేట్లు మూసేసి.. ఆధార్ చెక్‌చేసి..
మహబూబాబాద్ జిల్లా గూడూరు
మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు ఆపసోపాలు పడుతున్నారు. యూరియా కోసం రైతులు వేకువజామునే కేంద్రాలకు తరలివచ్చి క్యూలు కట్టడంతో వారిని నిలువరించడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. వర్షం వస్తున్నా లెక్కచేయని రైతులు యూరియా బస్తాల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తూ నిల్చున్నారు. కొన్ని చోట్ల గేట్లు మూసివేసి రైతులను లోపలికి వదిలేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో రైతులు తిరగబడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజంతా ఎదురుచూసినా యూరియా బస్తా దొరక్కపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు.
ఒక్కో బ్యాచ్‌కు వందమంది
మహబూబాబాద్ జిల్లా గూడూరు
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా గూడూరు పీఏసీఎస్ వద్ద సోమవారం రాత్రి నుంచే రైతులు చెప్పులు లైన్లోపెట్టి దుప్పట్లు తెచ్చుకుని అక్కడే నిద్రించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే భారీ క్యూ ఉండడంతో పోలీసు పహారాలో వంద మంది రైతులను ఒక బ్యాచ్‌గా చేసి ఒక్కొక్కరికి టోకెన్ ఇచ్చి యూరియాను అందించారు.1,184 బస్తాలను పంపిణీ చేసి, 200 మందికి టోకెన్లు ఇచ్చినట్టు ఏవో అబ్దుల్మాలిక్ తెలిపారు. ఎస్పీ రాంనాథ్ కేకన్, డీఎస్పీ తిరుపతిరావు వర్షంలోనే పీఏసీఎస్‌లోని క్యూను పర్యవేక్షించారు.
కోడి కూయక ముందే ..
నల్లగొండ జిల్లా తిప్పర్తి
ఏం జరిగింది: నల్లగొండ జిల్లా తిప్పర్తి పీఏసీఎస్‌కు రైతులు కోడికూయక ముందే చేరుకున్నారు. అయినా సరిపడా యూరియా దొరకడం లేదు. ప్రస్తుతం 10 టన్నుల యూరియా వచ్చిందని మరో రెండు రోజుల్లో అందరికీ ఇస్తామని పీఏసీఎస్ సిబ్బంది తెలుపడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.
యూరియా కోసం తండ్లాట
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్
ఏం జరిగింది : ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి 300 మందికిపైగా తరలివచ్చి యూరియా కోసం బారులు తీరారు.
రోజంతా క్యూలోనే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ
ఏం జరిగింది : కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగుపాడు సహకార కేంద్రం వద్ద ఒక్కో రైతుకు రెండు కట్టలే పంపిణీ చేయడంతో అరకొర యూరియాతో వ్యవసాయం ఎలా చేసేదని రైతులు వాపోయారు.
యూరియా కొరత రాష్ర్టాన్ని వణికిస్తున్నది. రైతులను రోడ్డుపాలు చేస్తున్నది. వానలోనూ రైతులు బస్తా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద మంగళవారం ఎరువుల కోసం బారులు తీరిన వందలమంది రైతులు