నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 24 ఆయుధాలు, 733 తూటాలు, 8 బీజీఎల్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు తెలంగాణ వాళ్లు ఉండటం గమనార్హం.
పోలీసుల వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్/కంపెనీ స్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా/ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యులు ఉన్నారు. ఇన్సాస్ ఎల్ఎంజీ, ఏకే–47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, .303 రైఫిళ్లు తదితర ఆయుధాలు లొంగుబాటులో భాగంగా అప్పగించారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము ప్రధాన జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను పరిశీలిస్తున్న డీజీపీ
లొంగిపోయిన వారికి రాష్ట్ర పునరావాస విధానం ప్రకారం డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. ఆయుధాలపై అదనపు రివార్డు కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని, మిగిలిన అజ్ఞాత కేడర్లు కూడా హింసను వీడి జనజీవనంలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.