హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం శాసనసభలో పశుసంవర్ధక, మత్స్యశాఖ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కులవృత్తులపై ఆధారపడిన జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీతో కులవృత్తులకు జీవం పోశామని చెప్పారు.
మూగజీవాల కోసం రాష్ట్రంలో 20,117 దవాఖానలు, 530 మంది గోపాలమిత్రలు, 100 సంచార పశు వైద్యశాలల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. పాడి రైతులకు 60 వే ల గేదెలను రాయితీతో అందించామన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ, రూ.కోట్ల విలువైన వాహనాలను సబ్సిడీలో పంపిణీ చేశామని వెల్లడించారు. 2021-22లో రూ.5,859 కోట్ల విలువైన 3.90 లక్షల టన్నుల మత్స్యసంపద పెరిగిందని వెల్లడించారు. దేశంలో అత్యధిక మత్స్య సహకార సంఘాలు(5,112) ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. మరో లక్ష మందికి మత్స్యసొసైటీల్లో సభ్యత్వం ఇస్తామని తెలిపారు.
ఆదాయంలో 70 శాతం వాణిజ్య పన్నులదే: తలసాని
రాష్ర్టానికి వచ్చే రాబడుల్లో 70 శాతం వాణిజ్య పన్నులశాఖ ద్వారానే సమకూరుతున్నదని మంత్రి తలసాని తెలిపారు. శనివారం అసెంబ్లీలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన పద్దులను మంత్రి వివరించారు. అస్కి కాలేజీతో ఒప్పందం కుదుర్చుకొని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, తద్వారా పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడంతో చెల్లింపులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో వివిధ క్యాడర్లతో 161 పోస్టులను సృష్టించి, భర్తీ చేశామన్నారు. 18 కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రెవెన్యూ రాబడి రూ.52,927 కోట్లు వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిరేటును నమోదైందని చెప్పారు. వాణిజ్యశాఖ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.329.2 కోట్ల పద్దును కేటాయించినట్టు తెలిపారు.
బడుగులపై వారి ప్రేమ తేలిపోయింది
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుంటే ఒక్క ప్రతిపక్ష సభ్యుడూ లేకపోవడం ఆ వర్గాలంటే ప్రతిపక్షాలకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది. ప్రభుత్వం అన్నీ చేస్తున్నది కదా.. ఇంకా మేమేం అడగాలని వాళ్లు భావించారేమో. లేదంటే వాళ్లు ఓ ప్రశ్న అడిగితే మంత్రులు ఇంకా నాలుగు అభివృద్ధి పనులు చెప్తారు.. ప్రశ్నలు అడగడం ఎందుకని అనుకున్నారేమో.
-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
ఒక్క ప్రతిపక్ష సభ్యుడూ లేకపోవడం దారుణం
ప్రజలకు సంబంధించిన పద్దుపై చర్చ జరుగుతుంటే ఒక్క ప్రతిపక్ష సభ్యుడు కూడా సభలో లేకపోవడం దారుణం. ఇదేనా వీళ్లు ప్రజలకు ఇచ్చే గౌరవం. సభలో ఉన్నప్పుడు సమయం ఇస్తే రాజకీయ విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. కానీ, ప్రజోపయోగ పద్దులపై చర్చ జరిగితే మాత్రం ఒక్కరూ ఉండటం లేదు. మీరైన(స్పీకర్‌ను ఉద్దేశించి) వారికి చెప్పాలి. దీన్ని ప్రజలు గమనించాలి.
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి