హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉద్యమకాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న అహంకారపు వ్యాఖ్యలను వెనకి తీసుకొని తెలంగాణ జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, బతుకమ్మను కించపరిచేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ అస్తిత్వంపై దాడి-చర్చ’ అనే అంశంపై తెలంగాణ జాగృతి శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సమావేశంలో మేధావులు, వివిధ సంఘాల నేతలు ఇచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా పలు తీర్మానాలను ఆమోదించామని చెప్పారు.
సోనియా, ప్రియాంకాగాంధీకి సూటి ప్రశ్న
మహిళలు జరుపుకొనే బతుకమ్మను ముఖ్యమంత్రి అవమానించిన విషయం తెలిసిందా లేదా? అని సోనియాగాంధీని కవిత ప్రశ్నించారు. లేదంటే మీ సమ్మతితోనే రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారా అన్నది తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియాంకా గాంధీ కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు కాబట్టి అకడి చీరను కట్టుకొని పార్లమెంటులో మాట్లాడారని, మరి ఇక్కడి సీఎం తెలంగాణ తల్లి చేతుల్లోని బతుకమ్మను మాయం చేశారని, దీనికి మద్దతిస్తున్నారా? అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వచ్చి గ్యారెంటీ కార్డులపై సంతకాలు చేసి తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని చెప్తే నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు చేశారన్నారు. బహుజనులను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై బీసీ వర్గాలకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డిలో తెలంగాణ ఆత్మలేదు
ఎన్నడూ జై తెలంగాణ అని నినదించని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని కవిత వాపోయారు. రేవంత్‌రెడ్డికి మనసు, ఆత్మ లేదని, ఆయన ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదు కాబట్టి తెలంగాణ హృదయం అర్థమవ్వడం లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో రేవంత్‌రెడ్డి ఎకడా లేరని గుర్తుచేశారు. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి అస్థిరపరిచే కుట్ర చేశారని, ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎకిపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.
సంస్కృతిపై దాడిని ఖండించాల్సిందే
మన సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒకరూ ఖండించాల్సిన అవసరం ఉన్నదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే విగ్రహ రూపాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టు ఉంటుందని స్పష్టంచేశారు. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అని, అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మన అస్థిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని, అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదని, ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతున్నా మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదని స్పష్టంచేశారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, విశ్రాంత అధ్యాపకురాలు దేవకీదేవి, అంబేదర్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, ప్రొఫెసర్ సీతారామారావు, గాయకురాలు తేలు విజయ, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలస్వామి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపధ్యక్షురాలు వీ జయంతి, సామాజిక ఉద్యమకారిణి, ప్రొఫెసర్ రేఖారావు, విద్యార్థి నాయకుడు యాకుబ్ రెడ్డి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ కుమార్, ప్రొఫెసర్ కనకదుర్గ, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఏల్చల దత్తాత్రేయ, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు దేవీప్రసాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాలు
అందరం కలిస్తేనే అందమైన బతుకమ్మ అవుతుంది.. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణతల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది?
-ఎమ్మెల్సీ కవిత
బతుకమ్మ బహుజనుల పండుగ: దేశపతి శ్రీనివాస్
బతుకమ్మ పూర్తిగా బహుజన కులాల పండుగ అని, అగ్రవర్గాల పండుగ కానేకాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణ తల్లిపైనే కాకుండా బతుకమ్మపై కూడా దాడి చేస్తున్నారని విమర్శించారు. ఆదిమ సంసృతి నుంచి వచ్చిన బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని తేల్చిచెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై జరిగిన దాడి కన్నా ఇప్పుడు ఎకువగా జరుగుతున్నదని, కొంత మందిలో ఇంకా సమైక్యవాద పోకడలు పోలేదని విమర్శించారు. ఇది కేవలం తెలంగాణ తల్లిపై దాడి కాదని, మలిదశ ఉద్యమ చరిత్రను చెరిపివేయాలన్నది రేవంత్‌రెడ్డి కుట్ర అని మండిపడ్డారు. తెలంగాణ అమరుల స్థూపం వద్దకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లడం లేదని చెప్పారు. చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని రాచరిక చిహ్నాలని సీఎం అనడం సరికాదని హితవుపలికారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసేందుకు ప్రేరేపించింది తెలంగాణ తల్లి అని, తెలంగాణ తల్లే కోదండరాంను జేఏసీ చైర్మన్‌గా చేసిందని, కేసీఆర్‌ను నాయకుడిని చేసిందని వివరించారు. అందరి గుండెల్లో ముద్రించుకొని ఉన్న తెలంగాణ తల్లిని మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి కిరీటం పెట్టుకోవచ్చు కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఉండొద్దా? అని ప్రశ్నించారు. ప్రాచీన శిల్ప సంపద నుంచి పుట్టింది తెలంగాణ తల్లి అని వివరించారు.
చేతి గుర్తు కోసం బతుకమ్మ మాయం: వీ ప్రకాశ్
చేతి గుర్తు కోసమే తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేశారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుష్ట లక్ష్య సాధన కోసం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లిని కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లిని బందీ చేశారని విమర్శించారు. ఇక నుంచి జూన్ 2న తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు చేసే కార్యక్రమం చేపడదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ తెలంగాణ తల్లి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు.
శిల్ప శాస్త్రం ప్రకారమే రూపం: ఎమ్మెల్సీ వాణిదేవి
కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగాన్ని తలపిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి విమర్శించారు. శిల్ప శాస్త్రం ప్రకారమే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి కాని, బీదగా ఉండవద్దని నాడు కేసీఆర్ చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రూపు మార్చడం దారుణం: కేవీ రమణాచారి
దేవతామూర్తిలా ఉన్న తెలంగాణ తల్లిరూపును మార్చడం దారుణమని బ్రాహ్మణ పరిషత్తు మాజీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ కేవీ రమణాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వయంగా ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం సిగ్గనిపిస్తున్నదని మండిపడ్డారు. సబ్బండవర్గాలు కలిసి ఆడుకునే బతుకమ్మను కొంతమంది కించపర్చడం సరికాదని హితవుపలికారు. ప్రభుత్వం ప్రతిష్ఠించిన విగ్రహంలో అభయ హస్తం అంటే ఏమిటో ప్రతి ఒకరికీ తెలుసని చెప్పారు.
సాంసృతిక వైభవానికి ప్రతీక : వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ తల్లి ఒక ప్రతిమ కాదని, సాంసృతిక వైభవానికి ప్రతీక అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ చెప్పారు. ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచేలా తెలంగాణ తల్లిని కేసీఆర్ తయారు చేయించారని తెలిపారు. చరిత్ర నిర్మాణం, ఉద్యమాలు, గత వైభవాలపై అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రను చెరిపే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘బతుకమ్మ అంటే బతుకుజీవుడా అని కాదు.. అది మహిళా శక్తికి ప్రతీక.. అటువంటి బతుకమ్మనే తీసేశారు’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టానికి గొప్ప పేరు తేకున్నా, వైభవాన్ని తొలగించవద్దని సూచించారు.
ప్రజల అభీష్టాన్ని మార్చలేరు : టంకశాల
జీవోలతో, బెదిరింపులతో ఇంగితం లేకుండా మాట్లాడితే ప్రజల అభీష్టాలు మారవని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖ సంపాదకుడు టంకశాల అశోక్ చురకలంటించారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ ప్రజల్లో సిర్థపడ్డ మనోభావాలని, వాటిని మారుస్తామనడం తెలివితక్కువ తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు తానే విలన్‌గా ప్రకటించుకున్నారని విమర్శలు సంధించారు.
తెలంగాణకు బతుకమ్మ వెన్నెముక: బీవీఆర్ చారి
మనిషి శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో.. తెలంగాణ రాష్ర్టానికి బతుకమ్మ అంతే ముఖ్యమని తెలంగాణ తల్లి రూపకర్త బీవీఆర్ చారి స్పష్టంచేశారు. తెలంగాణ తల్లి దేవతా మూర్తిగా ఉండాలని కేసీఆర్ భావించారని, సుదీర్ఘ చర్చలు జరిపి, ఎంతో ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని గుర్తుచేశారు. అసలైన తెలంగాణ చరిత్రను తుడిచివేయడం సరికాదని హితవుపలికారు. మన సంసృతిని, చరిత్రను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని చరిత్రపుటల్లోంచి ఎవరూ తొలగించలేరని తేల్చిచెప్పారు.
ఉద్యమంలో నుంచి పుట్టిన తల్లిని మార్చడం సరికాదు: హమీద్ ఖాన్
ఉద్యమంలోంచి పుట్టిన తెలంగాణ తల్లిని మార్చడం సరికాదని జమాతే ఇస్లామీ హింద్ అధినేత హమీద్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ తల్లి ప్రతీక అని, వేలాది గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కరుడుగట్టిన సమైక్యవాదిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విగ్రహం కాదు..తెలంగాణ అస్తిత్వం: గోగు శ్యామల
తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని, తెలంగాణ అస్తిత్వమని ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల అన్నారు. సంసృతిని తుడిచివేసే ప్రయత్నం దుర్మార్గమని, ఆంధ్రా పాలకులు మన సంసృతిని ఏనాడూ గౌరవించలేదని, ఇప్పుడు స్వరాష్ట్రలోనే అలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సంసృతి, అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు.