ముదిగొండ, ఏప్రిల్ 30 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం ఎంపిక చేస్తున్న జాబితాలో ఒక్క దివ్యాంగుడు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 30 : ధనికులు, భూములు ఉన్న వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇండ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ పలువురు మహిళలు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలె మండలం బచ్చోడు గ్రామపంచాయతీ కార్యాలయానికి బుధవారం తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిసెలు, రేకుల ఇండ్లల్లో ఉన్న వారికి ఇండ్లు ఇవ్వకుండా ధనికులకే మంజూరు చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బోనకల్లు, ఏప్రిల్ 30 : అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆ పార్టీ నాయకులనే మంజూరు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం(ఎల్)పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, సీపీఎం నాయకులు మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన 24 ఇండ్లను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నత వర్గాలకే ఇచ్చారని ఆరోపించారు. తాము గుడిసెలు, రేకుల షెడ్లలో ఉంటున్నా ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని పంచాయతీ కార్యదర్శి మురళిని నిలదీశారు.