హైదరాబాద్ : ఒకప్పుడు పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు గాంచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు.