మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 : హబూబ్‌నగర్ నియోజకవర్గంలో నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో లక్ష ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. బుధవారంసర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా పాలకొండ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్వరి ఎంబి చర్చిలో కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ రెవరెండ్ ఎస్ వరప్రసాద్ మంత్రిని ఆశీర్వదించారు.
షాసాబ్ దర్గాలో పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రి ఆధ్వర్యంలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రిని ఆశీర్వదించి శుభం కలగాలని ఆశీర్వదించారు. గత పదేళ్లలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రి కుటుంబ సమేతంగా ఇంటింటి ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ఒకప్పుడు తాగునీటికి కూడా ఇబ్బందులు పడిన మహబూబ్‌నగర్ నేడు రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో ఒకటని అన్నారు.
పేదలకు ఎక్కడైతే కష్టం నష్టం జరుగుతుందో అక్కడ తాను ఉంటానని పేర్కొన్నారు. పాలకొండ ఒకప్పుడు మారుమూల గ్రామం గా ఉండేదని ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి రావడమే కాకుండా సమీపంలోని అతిపెద్ద బైపాస్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వచ్చాయన్నారు. గత పది ఏళ్ల అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల తీసుకువచ్చామన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల జీవో తీసుకువచ్చామని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజలంతా సహకరించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.