జమ్మికుంట, అక్టోబర్ 13: ‘పనిచేయని, పట్టించుకోని ఓ నాయకుడికి ఏడు సార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెస్తా. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా.. సంవత్సర కాలంగా గెలిచి, ముఖం చాటేసే నాయకుడు మనకు అవసరమా..? చెప్పండి. పనిచేసేదెవరో గుర్తించండి. మీ బిడ్డగా ఆదరించండి. అసెంబ్లీకి పంపండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, మాచినపల్లి, మడిపల్లి, అంకుశాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలను కలిశారు. సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరన్నర కాలంగా మీ మధ్యలో తిరుగుతున్నానని, ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వారి సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నానని తెలిపారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతి దరఖాస్తుదారుకు గృహలక్ష్మి మంజూరు చేయించానని చెప్పారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ చేయోద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, కేసీఆర్‌కు బహుమతిగా అందిద్దామన్నారు. అంతకుముందు గ్రామాల్లో మండలి విప్ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కౌశికన్న అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డె మమత-ప్రసాద్, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, మాచినపల్లి, మడిపల్లి, అంకుశాపూర్ సర్పంచులు వంశీధర్‌రావు, కల్పన, అన్నపూర్ణ, పరశురాములు, రాజిరెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఆర్బీఎస్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.