ములుగు రూరల్, అక్టోబర్26 : ఎన్నికల సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న పథకాలను ఆపే కుట్రలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi )అన్నారు. గురువారం ములుగు బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు దిక్కు తోచక కుట్రలకు పాల్పడుతూ సంక్షేమ పథకాలను ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది రైతులు ఉన్నారని, వారందరికి రైతుబంధును ఆపాలని అనడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకుల రీతి రైతు బంధుకు రాం, రాం, 24గంటలకు చెక్ పెట్టే రీతిలో ఉందని అన్నారు.
రైతులంతా పార్టీలంతా పార్టీలకు అతీతంగా ఆలోచించి కాంగ్రెస్ నాయకుల కుట్రలను గమనించాలని అన్నారు. సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలో కరువును తెచ్చే కాంగ్రెస్ నాయకుల పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రశ్నించే గొంతునని స్టేజీల మీద చెప్పుకునే ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ నాయకుల విధానాన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సీతక్కకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా వర్తింపజేస్తున్న రైతు బంధు పథకం లబ్ధిదారులంతా ఏక తాటిపైకి వచ్చి రైతులకు వెన్నంటి నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని నాగజ్యోతి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తదితరులు ఉన్నారు.