హుజూర్నగర్ : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్‌నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రోకర్లను నమ్మి రాజకీయాలు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి అతడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన హత్యలు మాటేమిటని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీపై అర్థం లేని ఆరోపణలు చేయటం మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో తట్టెడు మట్టిని కూడా పోయించలేదని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ తన కుటుంబంలో పదవుల కోసం రాజకీయాలు చేయడం తప్పా అభివృద్ధి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.
పది సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీకి 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారిలో పీసీసీ చీఫ్ ఎవరో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారన్నారు. అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు వచ్చానే తప్పా దోచుకోవడానికి, దాచుకోవడానికి రాలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేశారు .