కోదాడ : పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రూ.18 లక్షలు ముక్కు పిండి వసూలు చేశాడు. అందులో రూ.5 లక్షలు పోలీసులు రికవరీ చేసుకోగా.. మిగతా డబ్బు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణానికి చెందిన మతాన్.. అనంతగిరి, చిలుకూరు మండల పోలీస్ స్టేషన్లలో పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్నాడు.
అయితే, అతడిని కేసుల నుంచి రక్షిస్తానని కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీలోని అధికార పార్టీకి చెందిన ఒక చోటా నాయకుడు నమ్మించాడు. పోలీస్ స్టేషన్లో కేసులు లేకుండా చేస్తానని, జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తానని ఒప్పించాడు. అనంతరం మతాన్ వద్ద నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. అయినప్పటికీ రెండు పోలీస్ పోలీస్ స్టేషన్లలో పశువుల అక్రమ రవాణా కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం బెయిల్పై తిరిగి వచ్చిన మతాన్.. ఆ అధికార పార్టీ నాయకుడిని కలిసి.. తానిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీనికి ఆ అధికార పార్టీ నేత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
తాను అధికార పార్టీ నాయకుడినని, తనకు పై వాళ్ళ అండ ఉందని, పోలీసుల వద్ద తనకు పలుకుబడి ఉందని మతాన్కు సమాధానం ఇచ్చాడు. ఇచ్చిన పైసలు అడిగితే గరిడేపల్లి, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిస్తానని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. తన సొమ్ము తిరిగి ఇచ్చేయమని అడిగినందుకు పట్టణ సీఐ రమ్మంటున్నాడని, పదేపదే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని మతాన్ చెబుతున్నాడు. తాను ఇప్పటికే కేసుల విషయంలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చానని, అప్పులు చేసి సొమ్ము ఇచ్చినప్పటికీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదనగా చెప్పాడు.
అలాగే, తానిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే అతడి ఇంటి ముందే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో కాల్ కోదాడ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసులు రూ.5 లక్షలు రికవరీ చేసుకోగా, మిగతా రూ.13 లక్షలు కాంగ్రెస్ నేత స్వాహా చేశారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని, దీంతో ఎస్పీకే తమ గోడు వెళ్లబోసుకుంటామని మతాన్, అతడి తల్లి అంటున్నారు.